సంతనూతలపాడు (చీమకుర్తి): బావి ఒడ్డుపై కూర్చొని ఉన్న ప్రజాశక్తి విలేకరి కందుల వెంకట కృష్ణప్రసాద్ (60) ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన సంతనూతలపాడులో గురువారం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీఐ శేషగిరిరావు, ఎస్సై అజయ్‌బాబులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కామేపల్లివారిపాలెంలో నివాసం ఉంటున్న ప్రసాద్ మరణాన్ని కుటుంబ సభ్యులతో పాటు మీడియా మిత్రలు జీర్ణించుకోలేకపోతున్నారు. భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
బైక్ దొంగల ముఠా అరెస్టు
● రూ.15 లక్షల విలువైన 15 మోటార్ సైకిళ్ల స్వాధీనం
● నిందితుల్లో ఇద్దరు యువకులు, ఒక బాలుడు
● వివరాలు వెల్లడించిన చీమకుర్తి సీఐ, ఎస్సై
చీమకుర్తి: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను చీమకుర్తి శివారు ప్రాంతంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ. 15 లక్షల విలువైన 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ డి.ప్రసాద్, ఎస్సై ఎల్.సంపత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఇంకొల్లు పోలిరెడ్డి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన తన టీవీఎస్ రేడాన్ బైక్‌ను ఇంటి ముందు ఉంచగా చోరీకి గురైంది. దీనిపై ఆయన ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాహనాల చోరీలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం అనుమానాస్పదంగా కనిపించిన మద్దిపాడు మండలం కొలచనకోటకు చెందిన దేవరకొండ దినేష్ కుమార్, బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన కలుపుకూరి శరత్ బాబుతో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాల గుట్టు రట్టయింది. వీరి నుంచి రికవరీ చేసిన 15 బైకుల్లో.. చీమకుర్తికి చెందిన టీవీఎస్ రేడాన్, స్ప్లెండర్ ప్లస్, గ్లామర్, మార్టూరుకు చెందిన రెండు యూనికార్న్‌లు, టంగుటూరులో చోరీ చేసిన పల్సర్, శింగరాయకొండకు చెందిన యూనికార్న్, క్లాసిక్ ఉన్నాయి. అలాగే మద్దిపాడు ప్రాంతానికి చెందిన ప్యాషన్ ప్లస్, క్లాసిక్, రెండు సీబీ యూనికార్న్‌లు, బల్లికురవకు చెందిన గ్లామర్, దర్శికి చెందిన పల్సర్, గుంటూరు జిల్లా కొత్తపేట నుంచి అపహరించిన మరో పల్సర్ ఉన్నట్లు పోలీసులు వివరించారు.


