డీఆర్‌సీ సమావేశంలో ప్రతిపక్ష సభ్యుల ధ్వజం వెలిగొండతో పాటు ఇతర పథకాలపై ఇన్‌చార్జ్ మంత్రి కాకిలెక్కలు వెలిగొండకు రూ.2,900 ఖర్చు చేశామంటూ తప్పుడు లెక్కలు రెండేళ్లుగా తాగునీటి సరఫరా బిల్లులు రాలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేల గగ్గోలు అధికార పార్టీ వాళ్లే సాగునీటి చెరువుల్లో నీళ్లు వదిలి చేపలు పడుతున్నారు సమావేశంలో టీడీపీ నాయకుల అసహనం సొంత డబ్బా కొట్టుకోవటానికే డీఆర్‌సీ : ఎమ్మెల్యే తాటిపర్తి
ఒంగోలు సబర్బన్: నిధులివ్వకుండా ఉమ్మడి జిల్లాలో పనులు ఎలా జరుగుతాయని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు ధ్వజమెత్తారు. నిధుల లేమితో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ప్రకాశం భవన్‌లో బుధవారం జిల్లా రివ్యూ కమిటీ(డీఆర్‌సి) సమావేశం నిర్వహించారు. గతేడాది నవంబర్‌లో జరిగిన డీఆర్‌సీలో లేవనెత్తిన అనేక సమస్యలకు అధికారుల వద్ద సమాధానాలు లేకుండా పోయాయి. నిధులు విడుదల చేయకుండా పరిష్కారం ఏవిధంగా ఉంటుందన్నది ప్రతిపక్ష సభ్యుల వాదన. దానికి తోడు ఇన్‌చార్జ్ మంత్రి ఆనం మాత్రం సమావేశంలో కాకి లెక్కలు చెప్పి మ..మ అనిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత వెలిగొండకు రూ.2,900 కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఆనం చెప్పటంతో ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా ఒకరిమొఖం ఒకరు చూసుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలని ప్రకాశం, మార్కాపురం జిల్లాల అధికారులను ఇన్చార్జి మంత్రి ఆనం చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఉండవని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా అధికార పార్టీకి చెందిన నాయకులే సాగు నీటి చెరువులు, ప్రాజెక్టుల్లో ఉన్న చేపలు పట్టడానికి నీటిని బయటకు వదులుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆరోపించడం గమనార్హం. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు చేపలు పట్టుకునేందుకు చెరువులో నీళ్లు ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారని సమావేశంలో వాపోయారు. దీనికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైతం గొంతుకలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల్లో ఇలాంటి చర్యల వలన ఆయా చెరువుల్లో నీరు వృథా కావడంతో పాటు సమీప గ్రామాల్లోని భూగర్భ నీటిమట్టం కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కాపురం, పొదిలిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తినప్పుడు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేసిన వారికి రెండేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మార్కాపురం ఎమ్మెల్యే ఆరోపించారు.
సొంత డబ్బా కోసమే..: యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి
‘‘రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నాయకులు సొంత డబ్బా కొట్టుకోవటానికే డీఆర్‌సీ సమావేశం పెట్టారు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలోని సమస్యలను ఇన్‌చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళుతుంటే ఆయన పట్టించుకోవడం లేదు’’ అంటూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెప్పాల్సిన సమాధానం టీడీపీ ఎమ్మెల్యే చెప్పటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం గొంతు నొక్కటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి టీ–5 కాలువ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కాలువ నిర్మాణం ద్వారా మార్కాపురం జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. తన నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అధికారులకు సీసీ రోడ్ల విషయంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. కనీసం మంచినీటి బోర్లకు మరమ్మతుల కూడా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌కు బస్సు సౌకర్యం కల్పించాలని, మార్కాపురం జిల్లాలో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెలిగొండ నుంచి చిన్న స్పెల్లింగ్ దోషాలతో 1150 మంది పరిహారం పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక పక్కేమో వెలిగొండ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ప్రాజెక్టు పరిధిలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు.


