ఎంత పనిచేశావయ్యా | - | Sakshi
Sakshi News home page

ఎంత పనిచేశావయ్యా

Jul 15 2026 5:03 AM | Updated on Jul 15 2026 5:03 AM

ఆ ముగ్గురు చేసిన తప్పేంటి?

● ఒక హత్య.. రైలు పట్టాలపై ముగిసిన నాలుగు ప్రాణాలు
● ఏఓ హత్య కేసులో ఏ1 నిందితుడు భార్యా, పిల్లలతో ఆత్మహత్య

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/

తోటపల్లిగూడూరు (పొదలకూరు) :

బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్యోదంతం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఆస్తి కోసం మేనబావను హత్య చేసిన బావమరిది హరికృష్ణ ఉదంతం వెలుగులోకి రావడం, ఉలిక్కి పడిన నిందితుడు హరికృష్ణ కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ రెండు కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిల్చింది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పోలీస్‌శాఖ అవినీతి, నిర్లక్ష్యం వెరసీ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు హరికృష్ణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘోర కలికి కారణమైంది.

ఆ రోజే స్పందించి ఉంటే..

వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్య జరిగిన రోజే కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి ఉంటే.. ఈ రోజు ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఆ రోజే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలోనే కాదు.. ప్రస్తుతం దర్యాప్తు దశలో కూడా పోలీస్‌ శాఖ నిర్లిప్తత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ కదలికలపై నిఘా పెట్టలేకపోయారు. హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. భార్యాపిల్లలు ఆమె పుట్టింట్లో ఉండగా, మంగళవారం తెల్లవారుజామున వచ్చి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హరికృష్ణ, అతని కుటుంబ సభ్యుల ఫోన్‌ కాల్స్‌, కదలికలపై నిఘా ఉండి ఉంటే.. అభం శుభం తెలియని చిన్నారులతో పాటు జీవితాన్ని పంచుకున్న భార్య బతికుండేది. వారేం తప్పు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజునే హరికృష్ణ తాను చనిపోతున్నానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చినా.. పోలీస్‌శాఖ నిర్లిప్తంగా వ్యవహరించిందని జిల్లా ప్రజలు నిందిస్తున్నారు.

తెల్లవారుజామున ఇంటికొచ్చి..

హరికృష్ణ మంగళవారం తెల్లవారు జామున ఇంటికొచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకుని సింగరాయకొండకు వెళ్లాడు. అక్కడే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల భయం పట్టుకొని అరెస్ట్‌ చేస్తే బయటకు రావడం కష్టంగా మారుతుందని తన భార్య, పిల్లలు దిక్కులేని వారవుతారనే ఉద్దేశంతోనే హరికృష్ణ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.

వెంటాడిన అమావాస్య

ఏఓ శ్రీహరి గత నెల 15వ తేదీన అమావాస్య నాడు హత్యకు గురయ్యాడు. సరిగ్గా నెల తిరగకుండానే అదే అమావాస్య అయిన 14వ తేదీ మంగళవారం హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం యాధృచ్ఛికంగానే భావిస్తున్నారు.

నిందితుడి కదలికలపై నిఘా లేకపోవడంతోనే ఈ దారుణం

పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే..

ఆ కుటుంబం బతికి ఉండేది

పోలీస్‌ శాఖ అవినీతే ఆ కుటుంబంలో

పెను విషాదం

హత్య కేసులో ఇరుక్కుని.. కుటుంబాన్ని బలి తీసుకొని

జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చులు బాగా పెట్టేవాడు. అంతే స్థాయిలో అప్పుల పాలయ్యాడు. దీంతో ఆస్తిని కాజేయాలని బావ హత్య కేసులో ఏ–1 నిందితుడిగా మారాడు. చివరకు పోలీసులు గాలిస్తున్నారని అరెస్టుకు భయపడి తనతో పాటు అభం శుభం తెలియని చిన్న పిల్లలు, భార్యతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. ఏఓ శ్రీహరికి రెండో వివాహానికి హరికృష్ణ చెల్లిని ఇచ్చారు. శ్రీహరి మేనమామ కూడా కావడం వల్ల ఇద్దరి మధ్య ఆస్తి వ్యవహారాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీహరిని..హరికృష్ణ అంతమొందించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో హరికృష్ణకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా ఏ–1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తప్పించుకొని తిరుగుతున్నాడు. హత్య కేసులో ఇరుక్కుని తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాన్ని కూడా బలి తీసుకున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం ఏఓ శ్రీహరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హతుని బావమరిది కుడుముల హరికృష్ణ (32) ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌కు వెళ్లి భార్య ప్రణతి (29), కుమార్తె మూగాంబిక (5), కుమారుడు కౌశిక్‌(3)లతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘోరకలి తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావులవారి కండ్రికలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement