పోలీసుల నుంచి స్పందన లేదు
ఒంగోలు టౌన్: నగరం నడిబొడ్డున గోపాల్ నగర్‌లో క్షుద్ర పూజల కలకలం సృష్టించింంది. అయితే తమ బిడ్డ అనారోగ్యంతో చనిపోయాడని తల్లిదండ్రులు చెబుతుండగా.. లేదు క్షుద్రపూజల వల్లనే చనిపోయాడని బాలుడి తాత, బాబాయ్‌తో పాటుగా ఇరుగు పొరుగువారు చెబుతుండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..నగరంలోని గోపాల్‌నగర్ ఒకటో లైన్ ఎక్స్‌టెన్షన్ తిరుపతమ్మ గుడి సమీపంలో కటారి కిరణ్ కుమార్, నాగలత దంపతులు జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమారుడు రిత్విక కళ్యాణ్ చక్రవర్తికు ఆరేళ్ల వయసు. పుట్టుకతో పోలియో వ్యాధితో పాటు మానసిక వికలాంగుడు. సరిగా మాటలు కూడా రావు. కిరణ్ దంపతులు చక్రవర్తికి చికిత్స నిమిత్తం అనేక వైద్యశాలలు తిరిగారు. పుట్టుకతో వచ్చిన వ్యాధి కావడంతో తగ్గదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలో ఉన్న ఒక మహిళ నెల్లూరులో సయ్యద్ మొబినా అని ఒక మహిళ ఉందని, ఆమెకు ఒంట్లో దుర్గమ్మ తల్లి వస్తుందని, అక్కడకు వెళితే బాబుకు వ్యాధి నయమవుతుందని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన కిరణ్, నాగలత దంపతులు కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా కొడవలూరులో వున్న మొబినా దగ్గరకు వెళుతున్నారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం గోపాల్‌నగర్‌లోనే ఒక ఇల్లు అద్దె తీసుకొని మొబీనా ఇక్కడికే వచ్చి ఉంటుంది. చికిత్స పేరుతో బాలుడు చక్రవర్తిని తన వద్దే ఉంచుకొని ప్రతి రోజు మంత్రాలు చదువుతూ పూజలు చేయడం మొదలు పెట్టింది.
ఇరుగు పొరుగుకు వినిపించకుండా పాటలు పెట్టి...
బాలుడు చక్రవర్తిని తాళ్లతో కిటికీకి కట్టి వేప మండలు, తాళ్లతో కొడుతుండేదని స్థానికులు చెబుతున్నారు. బాలుడి కేకలు ఎవరికీ వినిపించకుండా పెద్ద శబ్దంతో పాటలు పెట్టేదని చెబుతున్నారు. బాలుడి ముఖఃం మీద కుంకుమ చల్లుతూ పెద్ద పెట్టున కేకలు పెడుతూ మొబీనా మంత్రాలు చదివేదని , దాంతో బాలుడి కళ్లల్లో కుంకుమ పడి ఊపిరాడక ఇబ్బంది పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మొబీనా దెబ్బలకు తాళలేక శనివారం ఉదయం బాలుడు చక్రవర్తి చనిపోయాడని, అయితే ఆదివారం మధ్యాహ్నం 3.35 గంటలకు బాలుడిని బతికిస్తానంటూ చెప్పిన మొబినా సమీపంలోని పుట్ట వద్ద పూజలు చేసిందని చెబుతున్నారు. అప్పటికీ బాలుడు చక్రవర్తి బతకలేదన్నారు. బాలుడి తండ్రి కిరణ్ మృతదేహాన్ని స్వయంగా భుజం మీద వేసుకొని తీసుకెళ్లినట్లు ప్రతక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బాలుడు చక్రవర్తి చనిపోయిన విషయం తెలుసుకున్న కిరణ్ సోదరుడు కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లో పూజలు చేస్తున్న మొబీనాను బెల్టుతో కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చాడని దీంతో అసలు విషయం చుట్టుపక్కల వారికి తెలిసిందని చెబుతున్నారు. కిరణ్ తండ్రి ఏడుకొండలు , బాబాయ్ కిషోర్ తాలుకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
అనారోగ్యంతోనే నా కుమారుడు మరణించాడు
అనారోగ్యంతోనే మా కుమారుడు చనిపోయాడని మృతుడు చక్రవర్తి తండ్రి కిరణ్, తల్లి నాగలత చెప్పారు. మొబినా సమక్షంలో తాలుకా పోలీసులు వీడియో రికార్డు చేశారు. ఈ సందర్భంగా బాలుడి తలిదండ్రులు కిరణ్, నాగలత మాట్లాడుతూ మొబీనాకు ఈ మరణంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. పక్షవాతంతో పుట్టిన తన కుమారుడికి వ్యాధి నయం కాదని వైద్యులు చెప్పడంతో తెలిసిన వారి ద్వారా మొబీనా దగ్గరకు వెళ్లామని, ఆమె ఆయిల్ మసాజ్ చికిత్స చేసిన తరువాతే తన కుమారుడు లేచి కూర్చుంటున్నాడని తెలిపారు. ఇదే విషయాన్ని తాలుకా పోలీసులకు రాత పూర్వకంగా రాసిచ్చారు.
మంత్రగత్తెను వెంటనే అరెస్టు చేయాలి
క్షుద్ర పూజల పేరుతో ఆరేళ్ల బాలుడిని అమానుషంగా చంపివేసిన మంత్రగత్తైపె, ఆమెకు సహకరించిన వారిపై హత్యా నేరం నమోదు చేయాలని, వెంటనే వారిని అరెస్టు చేయాలని ఏపి హేతువాద సంఘ అధ్యక్షుడు ఎంకే బేగ్, నాయకులు నజీర్, పూర్వ అధ్యక్షుడు శిఖా చంద్రశేఖర్‌బాబు డిమాండ్ చేశారు. పోలియో వ్యాధితో సచ్చు పడిపోయిన కాళ్లలో చలనం తెప్పిస్తానని చెప్పిన మంత్రగత్తె క్షుద్ర పూజలలో భాగంగా బాలుడిని చిత్ర హింసలు పెట్టిందని స్థానికులు చెబుతున్న మాటలను సాక్ష్యంగా తీసుకోవాలని కోరారు.
ఆరేళ్ల బాలుడి మృతిపై రకరకాల పుకార్లు
క్షుద్ర పూజలు చేశారంటున్న బాలుడి తాత, బాబాయ్, స్థానిక మహిళలు
అనారోగ్యంతో చనిపోయాడని చెబుతున్న బాలుడి తల్లిదండ్రులు
పరారీలో మంత్రగత్తె సయ్యద్ మొబినా
20 రోజుల నుంచి గోపాల్ నగర్‌లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని, ఆరేళ్ల బాలుడిని ఒక గదిలో బంధించి వేప మండలతో చిత్రహింసలు పెడుతుందని స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చినా సరైన స్పందన రాలేదని ఆరోపిస్తున్నారు. బాలుడు చనిపోయిన తరువాత, మృతుడి బాబాయ్, తాత పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత మాత్రమే స్పందించారని , సకాలంలో స్పందించి ఉంటే ఈ అమానుషం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్రవర్తికి ఆరోగ్యం బాగు చేస్తానని చెప్పి మొబీనా రూ.3 లక్షలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజనిజాలను తేల్చాలని, హత్య, మోసం కేసులు నమోదు చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అయితే దీనిపై తాలు సీఐ విజయకృష్ణను వివరణ కోరగా...గోపాల్ నగర్‌లో క్షుద్ర పూజల వలన ఆరేళ్ల బాలుడు చక్రవర్తి మరణించాడని చెప్పడం అవాస్తవమన్నారు. చక్రవర్తి అనారోగ్యంతో చనిపోయినట్లు బాలుడి తల్లిదండ్రులే చెబుతున్నారన్నారు. పోలియో వ్యాధితో బాధపడుతున్న చక్రవర్తి ఆరోగ్యం క్షీణించడం వల్లే చనిపోయాడని భావిస్తున్నామని తెలిపారు.


