మౌలిక వసతుల కల్పనకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల కల్పనకు చర్యలు

Jul 15 2026 5:03 AM | Updated on Jul 15 2026 5:03 AM

మౌలిక వసతుల కల్పనకు చర్యలు పరిశ్రమలకు రూ.13.43 కోట్ల ప్రోత్సాహకాలు షార్ట్‌ సర్క్యూట్‌తో హోటల్‌ దగ్ధం దరఖాస్తు గడువు పొడిగింపు ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి కిందపడి యువకుడు మృతి సిమెంట్‌ లారీ ఢీకొని వ్యక్తి మృతి

మార్కాపురం టౌన్‌: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పనకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయ సునీత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం రెవెన్యూ, వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి వసతి, పైపులైన్లు, ఇతర సదుపాయాలను అక్కడ ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు నెలాఖరుకు అన్ని కాలనీలో వసతులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. అదేవిధంగా పునరావాస పరిహారం కింద ఇంకా ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి వంటి అంశాలను వారంలో జాబితా తయారు చేసి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు, వెలిగొండ ప్రాజెక్టు ఎస్‌ఈ అబూ తాలిం, ఈఈ శ్రీనివాసరావు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, కంభం ఎస్‌డీసీ సత్యనారాయణ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో రూ.13.43 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్‌ పి.రాజాబాబు పేర్కొన్నారు. జిల్లా పారిశ్రామిక విస్తరణ, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని పరిశ్రమలకు సంబంధించిన వివిధ రకాల రాయితీల కోసం వచ్చిన 44 క్లెయిమ్‌లను పరిశీలించారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా పరిశ్రమల అనుమతుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించారు. పరిశ్రమల స్థాపన, అనుమతులు, ఇతర అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

పెద్దదోర్నాల: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి టిఫిన్‌ హోటల్‌ దగ్ధమైంది. ఈ సంఘటన యడవల్లి సమీపంలోని నయారా పెట్రోల్‌ బంక్‌ వద్ద మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో యడవల్లికి చెందిన బత్తుల బాలవెంకటేశ్వర్లుకు చెందిన హోటల్‌ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో తన కుమార్తెకు చెందిన 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ సర్టిఫికెట్లతో పాటు, రెండు ఫ్రిజ్‌లు కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఒంగోలు సిటీ: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత నిర్ణయించిన గడువుకు బదులుగా ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు సెల్ఫ్‌ నామినేషన్‌, ఐదుగురు ఫెలో టీచర్ల సిఫార్సు లేదా లీప్‌ యాప్‌ ద్వారా పనితీరు ఆధారిత ఎంపిక విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన ఉపాధ్యాయులు గడువు లోగా దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని డీఈఓ వెల్లడించారు.

గుడ్లూరు: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ బిగిస్తుండగా కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఏలూరుపాడు శాంతినగర్‌లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన మల్లికార్జున కరెంట్‌ పనులకు వెళుతుంటాడు. అదే క్రమంలో శాంతినగర్‌లో సింగిల్‌ ఫేస్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించే సమయంలో కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కావలి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య ఉన్నారు.

పామూరు: సిమెంట్‌ లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి మండలంలోని మోపాడు గ్రామం వద్ద పామూరు కందుకూరు 167బి జాతీయ రహదారిపై జరిగింది. వలేటివారిపాలెం మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన మితుకుల్ల అచ్యుత్‌ కుమార్‌ హీరోహోండా బైక్‌పై పామూరు వైపుకు వస్తున్నాడు. పామూరు వైపు నుంచి దుకూరు వైపుకు వెళ్తున్న సిమెంట్‌లారీ బైక్‌ను ఢీకొట్టగా మోటార్‌సైక్లిస్ట్‌ మితుకుల్ల అచ్యుత్‌కుమార్‌(37) రోడ్డుపై పడగా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై కట్టా అనూక్‌, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన సిమెంట్‌ లారీని పామూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనలో ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement