కష్టాల రొయ్య.. | - | Sakshi
Sakshi News home page

కష్టాల రొయ్య..

Jul 15 2026 5:03 AM | Updated on Jul 15 2026 5:03 AM

పెరిగిన సాగు వ్యయం వ్యయానికి తగ్గట్టుగా లేని ధరలు అంతర్జాతీయ ధరలు సాకుగా చూపుతున్న ఎక్స్‌పోర్ట్‌ వ్యాపారులు నాశిరకం సీడ్‌తో తప్పని కష్టాలు రైతుల కష్టాలు పట్టని ప్రభుత్వం సాగుకు అనుకూలంగా లేని వాతావరణం ఇలా అయితే క్రాప్‌ హాలిడే తప్పదంటున్న రైతులు

ఒకవైపు పెరుగుతున్న సాగు వ్యయం, మరోవైపు పడిపోతున్న రొయ్యల రేటుతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు కూడా రాని స్థితిలో రైతు కుదేలవుతున్నాడు. నాణ్యత లేని సీడ్‌తోపాటు డీజిల్‌ ధరలు సైతం పెరగడంతో సాగు మరింత భారంగా మారింది. అండగా నిలవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపుతుండడంతో సాగు కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సింగరాయకొండ: జిల్లాలో సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, గూడ్లూరు, ఉలవపాడు, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇందులో దాదాపు 13 వేల ఎకరాలు ’టైగర్‌’ రొయ్యలు, మిగిలిన 7 వేల ఎకరాలను ’వనామీ’ సాగు చేస్తున్నారు. ఒకప్పుడు డాలర్‌ పంటగా గుర్తింపు పొందిన ఆక్వాసాగు చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో రైతులు సాగు చేయాలంటే భయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యకు ధర లేదని ఎక్స్‌పోర్టర్లు ధరల్లో భారీగా కోత విధిస్తుండగా, కూటమి ప్రభుత్వ అండతో రొయ్యల మేత కంపెనీలు ధరలు ఇష్టారాజ్యంగా పెంచటం రైతులకు పెను భారంగా మారింది. ప్రస్తుతం మేత ధరలకు తగ్గట్టుగా రొయ్యల రేటు పెరగడంలేదు. వీటన్నింటికీ తోడు మోనో కంపెనీ రొయ్య పిల్లలు నాశిరకంగా ఉండటంతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

భారంగా కరెంటు చార్జీలు

ఎన్నికల సందర్భంగా అందరికీ కరెంట్‌ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దానిని గాలికొదిలేయడం కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. సన్నకారు రైతులకు మాత్రమే కరెంటు సబ్సిడీ యూనిట్‌కు రూ.1.50 లభిస్తుండగా మిగిలిన రైతులకు యూనిట్‌ ధర రూ.4.50 లు ఉందని రైతులు వాపోతున్నారు. ఇటీవల ఫీడ్‌ధర కేజీకి రూ.14 పెంచి ప్రభుత్వం నుంచి ఒత్తిడి తేవటంతో కేవలం రూ.2 లు మాత్రమే తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. కరెంటు సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రావాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.

అనుకూలించని వాతావరణం

ఆక్వాకు పెరిగిన సాగు ఖర్చులతో పాటు వాతావరణ మార్పులు కూడా అనుకూలంగా లేవు. జూలై నెల వచ్చినా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, చెరువుల్లో పరిమితికి మించి రొయ్య పిల్లలను సాగు చేయటంతో తెల్లమచ్చ తెగులు సోకుతోంది. మోనో కంపెనీ రొయ్యలు నాశిరకంగా కారణంగా పిల్లల్లో ఎదుగుదల సరిగా లేదని, దీంతో ఖర్చులు పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తగ్గిన రొయ్య ధరలు:

ఆక్వా సాగు ఖర్చులు తగ్గట్లు రొయ్యల కొనుగోలు ధరలు ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైగర్‌ రొయ్య కేజీ 20 కౌంట్‌ ధర రూ.700 ఉంటే తప్ప గిట్టుబాటు కాదు. ప్రస్తుతం కేజీ ధర 20 కౌంట్‌ రూ.640, 30 కౌంట్‌ రూ.530లకు గాను రూ.470 మాత్రమే ఉంది. ఇలాగైతే సాగు చేయటం కష్టమని ఓ రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రేడియేటర్‌ ధర సుమారు రూ.5 వేలు అదనంగా పెరిగిందని, డీజిల్‌ ఇంజన్లు అద్దె నెలకు పవర్‌ను బట్టి రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెరిగాయన్నారు. సాగు తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెంచి, తీరా రొయ్యల పట్టుబడులు జరిగేటప్పుడు మాత్రం వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని, గత్యంతరం లేక తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎక్స్‌పోర్టర్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదని, ఇలాగైతే ఆక్వా సాగుకు క్రాప్‌ హాలిడే ఇవ్వడం తప్ప గత్యంతరం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement