ఒంగోలు సబర్బన్: జిల్లాలో 1649 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 13,99,006 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. వీరిలో 40,737 మంది ఓటర్లు చనిపోయారని, 23,025 మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లారని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను 100 శాతం డిజిటైజేషన్ చేశామన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ 90.75 శాతం అయిందన్నారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ గడువును ఎన్నికల సంఘం పది రోజులు పొడిగించినందున పూర్తిస్థాయిలో అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు కొనసాగిస్తామన్నారు. బీఎల్‌ఓలకు క్షేత్రస్థాయిలో బీఎల్‌ఏలు సహకరిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఓటర్లను కావాలని తొలగించే ప్రక్రియే జరగలేదన్నారు. బీఎల్‌ఓలకు రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు బాగా సహకరించారన్నారు. ఓటర్లకు ఎలాంటి అపోహలకు తావులేకుండా సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు.


