తప్పు కప్పిపుచ్చుతూ..
సాక్షి టాస్క్‌ఫోర్స్: దర్శి నియోజకవర్గంలో టీడీపీ ముఖ్యనేత కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు రోజురోజుకూ ఇంకాస్త దిగజారిపోతున్నారు. ఏకంగా పచ్చ కండువాలు కప్పుకున్నట్లుగా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రోజుకో రకంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ చూసి నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కురిచేడు మండలంలో వెంచర్ వేసిన వ్యక్తిని ఆదివారం అక్రమంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. సోమవారం తమ పచ్చ దందాను కొనసాగించారు. సదరు వెంచర్‌కు అనుమతులు లేవంటూ వెంచర్ ముఖద్వారం గోడకు నోటీసులు అంటించారు. కురిచేడు మండలంలో ఈ రెండేళ్లలో 100 ఎకరాలకుపైగా పొలాలను వెంచర్లుగా మార్చారు. అయితే, విజయవాడకు చెందిన వ్యక్తులు నమశ్శివాయపురం పంచాయతీ మల్లాయపాలెం రెవెన్యూ విలేజ్‌లో వెంచర్లు వేసిన 13 సర్వే నంబర్లలో 26.56 ఎకరాల భూమిలో వేసిన ఒక్క వెంచర్‌కు మాత్రమే అనుమతులు లేవని గ్రామ కార్యదర్శి ద్వారా సోమవారం నోటీసులు అంటించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఆ వెంచర్ యజమాని విజయవాడ, రాజమహేంద్రవరం నుంచి బస్సులో కొనుగోలుదారులను తీసుకురాగా.. అదే సమయంలో పోలీసులు వచ్చి బస్సును నిర్బంధించి అక్కడకు వచ్చిన వారిని వేరే వాహనాలు చూసుకుని వెళ్లాలంటూ పంపించి వేశారు. దీనిపై సోమవారం పత్రికల్లో కథనాలు రావడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం వెంచర్ వద్ద గ్రామ కార్యదర్శితో నోటీసులు అంటించారు. వెంచర్‌లో ఉన్న బస్సును పంపించి వేసి నోటీసులు అంటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పంచాయతీ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన విషయంలో ఆదివారం పోలీసులు రంగ ప్రవేశం చేయడం వెనుక గొట్టిపాటి లక్ష్మి హస్తం ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. పోలీసుల తీరుపై సాక్షి దినపత్రికలో ‘వెంచర్ వేస్తే వాలిపోతున్న టీడీపీ గద్దలు’ అనే శీర్షికతో సోమవారం కథనం ప్రచురితమవడంతో అందరూ తేలుకుట్టిన దొంగలు మాదిరిగా వ్యవహరించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, టీడీపీ ముఖ్య నేతపై వచ్చిన నిందను తొలగించేందుకు పంచాయతీ అధికారులను పురమాయించి నోటీసులు అంటించారని ప్రజలు విమర్శిస్తున్నారు. గొట్టిపాటి లక్ష్మికి వెంచర్ యజమాని డబ్బులు ఇవ్వలేదనే ఇలా చేస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కురిచేడు మండలంలోని వెంచర్‌కు అనుమతులు లేవంటూ నోటీసులు
ఆదివారం వెంచర్ యజమానినిఅదుపులోకి తీసుకున్న పోలీసులు
సోమవారం వెంచర్ గోడకు నోటీసులు


