మార్కాపురం: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల 15 నుంచి ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. కలెక్టరేట్‌లో రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమంపై సోమవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. 15 నుంచి అంగన్‌వాడీ, పాఠశాల ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాలను ప్రారంభించాలని తెలిపారు. అంగన్‌వాడీ పిల్లలకు ఆరోగ్య పరీక్షలను ఏడాది రెండుసార్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏడాది ఒకసారి నిర్వహించాలని సూచించారు. ఈ స్క్రీనింగ్ కార్యక్రమాలను ఏఎన్‌న్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, మెడికల్ ఆఫీసర్లు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 5 ఏళ్ల లోపు అంగన్‌వాడీ పిల్లలు సుమారు 54,868 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సుమారు 96,048 మంది విద్యార్థులకు ఆరోగ్య స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి పద్మావతి, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డి. చంద్రశేఖరరావు పాల్గొన్నారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.


