ఆర్‌ఎస్‌కేలతో లేఖర్లకు చెల్లు చీటీ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌కేలతో లేఖర్లకు చెల్లు చీటీ

Jul 13 2026 4:25 AM | Updated on Jul 13 2026 4:25 AM

దస్తావేజు లేఖర్ల కుటుంబాల పొట్ట కొడుతున్న కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న లేఖర్లు జీవో నంబరు 396ను రద్దు చేయాలని డిమాండ్‌ ఉమ్మడి జిల్లాలో 18 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఉపాధి కోల్పోనున్న 4500 మంది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్‌ సేవలు కొనసాగించాలంటున్న లేఖర్లు

అద్దంకి: నాలుగైదు దశాబ్దాలుగా దస్తావేజు లేఖరులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు, కూటమి ప్రభుత్వ అనాలోచిత చట్టంతో బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వ తీరుతో జిల్లాలో 4500 మంది దస్తావేజు లేఖర్లు ఉపాధి కోల్పోనున్నారు. వారితోపాటు డీటీపీ ఆపరేటర్లు, రైటరు అసిస్టెంట్లు, వెండర్ల కుటుంబాలు ఉపాధికి గండిపడనుంది. రిజిస్ట్రేషన్‌కు ముందు జరిగే ప్రక్రియలో లేఖర్లను తప్పించి ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం జీవో నంబరు 396ను తెచ్చింది. తద్వారా ఆర్‌ఎస్‌కే (రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు) ఏర్పాటుతో క్రయ విక్రయదారుల డాక్యుమెంట్లను తయారు చేయాలని నిర్ణయించింది. దాంతో ఉమ్మడి జిల్లాలోని 18 సబ్‌రిజిస్ట్రార్‌ కేంద్రాల పరిధిలో సమారు 4500 మంది కుటుంబాలు ఉపాధి కోల్పోనున్నాయి.

ప్రైవేటీకరణతో పారదర్శకతకు భరోసా ఉంటుందా?

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో డ్యాక్యుమెంట్ల తయారీలో రైటర్లదే కీలకపాత్ర. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చే భూమి, ఇళ్లు, వివాహ ధ్రువీకరణ, మార్ట్‌గేజ్‌, తదితర పత్రాల తయారీలో లేఖర్లు ఎన్నో సంవత్సరాల అనుభవంతో డాక్యుమెంటును తయారు చేసి, ఆధార్‌, రిజిస్ట్రేషన్‌ సేవా రుసుముల రసీదులను జత చేసి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు తీసుకెళితేనే అవి ఏ ఇబ్బంది, ఎటువంటి పోరబాటూ లేకుండా, ప్రభుత్వ ఆధీనంలో రిజిస్టర్‌ అవుతూ ఉంటాయి. దాంతో న్యాయపరిధిలో డాక్యుమెంటు రిజిస్ట్రేషన్‌ వచ్చేలా చూడటంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల పేరిట ప్రైవేటుకు అప్పగిస్తే పారదర్శకత లోపించే అవకాశం ఉంది. అంతేకాకుండా సమాన్యులకు ఈ సేవ దూరం అయ్యే ప్రమాదం ఉంది. వేలమంది రైటర్లు, అసిస్టెంట్లు, డీటీపీ ఆపరేటర్లు, వెండర్ల కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధి కోల్పోనున్నాయి.

గతంలో పెన్‌డౌన్‌..

రైటర్లు గతంలో రెండు రోజుల పాటు పెన్‌డౌన్‌ చేశారు. ఈ పెన్‌డౌన్‌ను భూమి విక్రయించేవారు రిజిస్ట్రేషన్‌కు డాక్యుమెంటు సిద్ధం చేసే సమయంలో ఆధార్‌ ఓటీపీ విధానం, అలాగే పీడీఈ (పబ్లిక్‌ డేటాఎంట్రీ) రైటర్‌ కాకుండా సబ్‌రిజిస్ట్రార్‌ తన లాగిన్‌లో చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ పెన్‌డౌన్‌కు సిద్ధమయ్యారు. అప్పట్లో నిసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం తెచ్చిన 396 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ పరంగానే రిజిస్ట్రేషన్‌ కార్యాక్రమాలను నిర్వహించాలని, లేఖరులుగా ఉన్న కుటుంబాలు, దాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్న కుటంబాల పొట్ట కొట్టవద్దని వేడుకుంటున్నారు.

లేఖర్లు కోరుతున్నవి ఇవే..

ప్రత్యామ్నాయ సేవా కేంద్రాల ఏర్పాటు చేయవద్దని, రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టవద్దని కోరుతున్నారు. దస్తావేజు లేఖరుల లైసెన్స్‌లను పునరుద్ధరించాలని, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, అసిస్టెంట్ల ఉపాధిని పరిరక్షించాలని సీనియర్‌ రైటర్లు ఎన్‌ సుబ్బారావు, డీ శ్రీనివాసరావు, సురేశ్‌, పవన్‌, తదితరులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement