పామూరు: మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలెం రఘునాథపురం గ్రామంలో అచ్చమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఎడ్ల బండలాగుడు పోటీల్లో నంద్యాల జిల్లా అలగనూరు ఎడ్లజత ప్రథమ స్థానంలో నిలిచింది. పోటీల్లో మొత్తం 5 జతల ఎడ్లు పాల్గొనగా నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన కట్టుబడి రోలీమేడం ఎడ్లజత పందెపు రాయిని నిర్దేశిత సమయంలో 2003.1 అడుగులు లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. అదేవిధంగా వీరికి చెందిన మరో ఎడ్లజత పందెపు రాయిని 263 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రంగసాయిపల్లెకు చెందిన మార్తాల వెంకట సుబ్బారెడ్డి ఎడ్లజత 1859.3 అడుగులు లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ రెడ్డిపాలెం కారసాని హేమచంద్రారెడ్డి ఎడ్లజత 1500 అడుగులతో తృతీయ స్థానంలో నిలిచాయి. తెలంగాణ నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కొప్పోలు గ్రామం ఐతరాజు సత్యనారాయణ ఎడ్లజత 1328.10 అడుగులు లాగి నాల్గవ స్థానంలో నిలిచాయి. పోటీల్లో విజేతలకు బహుమతులు వరుసగా ప్రథమ రూ.50 వేలు పల్లపు కుటుంబ సభ్యులు, ద్వితీయ రూ.40 వేలు విఠల్, దుర్గాప్రసాద్, శ్రీకాంత్, మణికంఠలు, తృతీయ రూ.25 వేలు డేరంగుల శ్రీను, నాల్గవ బహుమతి రూ.10 వేలు పైడిమళ్ల రమణ, 5వ బహుమతి ఆలయ కమిటీ సమకూర్చగా వాటిని ఆలయ కమిటీ సభ్యులు విజేతలకు అందజేశారు.


