ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్‌బాబు
మార్కాపురం: కార్మికుల సమస్యల పరిష్కారం, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల కల్పన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేయనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి ఎం. రమేష్‌బాబు తెలిపారు. మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అంగన్‌వాడీ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్మికులకు వేతనాల పెంపు, ఉద్యోగులుగా గుర్తింపు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. కార్మికుల ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వినియోగిస్తోందని, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చర్యలను ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సచివాలయ హెల్త్ సెక్రటరీలు, గ్రేడ్–3 ఏఎన్ ఎంలకు వెంటనే పదోన్నతులు కల్పించి, వారిని పూర్తిగా వైద్యశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 49 యాప్‌ల నిర్వహణ, ఫీల్డ్ డ్యూటీలు, బయోమెట్రిక్ హాజరు విధానం కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పదోన్నతుల జాప్యంతో వేలాది మంది ఉద్యోగులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందడం లేదని, ప్రమాదాల్లో గాయపడిన లేదా మృతి చెందిన కార్మికులకు వెంటనే నష్టపరిహారం చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కార్మిక సంఘాల నాయకులకు వినతిపత్రాలు సమర్పించే అవకాశాన్ని కూడా కల్పించడం లేదని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత సాధన కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఎం.రమేష్‌బాబు స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీ కృష్ణగౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు అందే నాసరయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ యాసిన్, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


