గిద్దలూరు రూరల్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ బరస్ట్ అయి మంటలు చెలరేగి ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట తాండా వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే..అనంతపురం నుంచి విజయవాడకు వెళుతున్న బాలాజీ ట్రావెల్స్ బస్సు వెనుకాల టైర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో పాటుగా పెద్ద శబ్ధం వచ్చి అదే సమయంలో టైర్ చక్రాల నుంచి స్వల్పంగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపి మంటలను అదుపులోనికి తీసుకొచ్చాడు. అనంతరం పగిలిపోయిన బస్సు టైర్‌ను తొలగించి మరమ్మతులు చేశారు. సమాచారం అందుకున్న సీఐ కె.సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు కండీషన్‌ను పరిశీలించారు. మరమ్మతుల అనంతరం బస్సు ప్రయాణికులతో గమ్యస్థానానికి బయలుదేరి వెళ్లింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


