రహదారుల
కంభం:
జాతీయ రహదారి రక్తమోడుతోంది. అనంతపురం–అమరావతి(ఎన్‌హెచ్ 544–డీ)పై గడిచిన రెండు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 15 మంది మృత్యువాత పడి పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారంటే ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తరుచూ జరుగుతున్న ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. లారీలు, ఆటోలు, ద్విచక్రవాహనాలతో పాటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
తరుచూ ప్రమాదాలు..
కొమరోలు మండలం తాటిచెర్లమోటు మొదలు బేస్తవారిపేట, కంభం, మార్కాపురం, పెద్దారవీడు మండలం కుంట వరకు గడిచిన రెండు నెలల్లో 12కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 15 మంది మృత్యువాత పడగా మరో 15 మందికి పైగా తీవ్రగా యాలపాలయ్యారు. వీటితో పాటు పలు చోట్ల జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయాల పాలయ్యారు. అనంతపురం – అమరావతి జాతీయరహదారి వెళ్లే కొమరోలు మండలం తాటిచర్ల మోటు, బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు, మోక్షగుండం, కంభం మండలం జంగంగుంట్ల, మార్కాపురం మండలం తిప్పాయిపాలెం, చింతకుంట్ల, పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు, హనుమాన్ జంక్షన్ కుంట మధ్యలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ హాట్ స్పాట్‌లుగా మారుతున్నాయి.
నివారణ చర్యలేవి..?
హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు వాటి నివారణకు తూతూమంత్రంగా మాత్రంగా చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. హైవేపై అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, యూటర్న్, మూలమలుపుల వద్ద లైటింగ్ లేకపోవడం, సూచికలు ఏర్పాటు చేయకపోవడం, హైవే మార్జిన్లు ప్రమాదకరంగా ఉండటం పట్టణాల్లో నుంచి వెళ్లే హైవే రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలతో రోడ్డు కుంచించుకుపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేపై తరచూ మరమ్మతుల పేరిట చిప్స్ చల్లి వదిలేస్తుండటంతో ద్విచక్రవాహనదారులు, ఇతర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు.
పోలీసులు అవగాహన కల్పిస్తున్నా..
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని పోలీసులు నిత్యం చెబుతున్నా వాహనదారులు వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో ఏ మాత్రం చలనం రావడం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో మలుపుల వద్ద, సెంటర్ల వద్ద పోలీసులు రక్షణ మిర్రర్‌లను ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
తరుచూ ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్న జాతీయ రహదారి
అనంతపురం– అమరావతి హైవేపై పెరిగిపోతున్న ప్రమాదాలు
తాటిచెర్లమోటు – కుంట మధ్యలో అధిక ప్రమాదాలు
2 నెలల్లో 15 మంది మృత్యువాత
హైవేలపై కానరాని హెచ్చరిక బోర్డులు
ప్రమాదకరంగా యూ టర్న్ లు


