యర్రగొండపాలెం: సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో మునిగి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లిలో ఆదివారం జరిగింది. పాఠశాలకు సెలవు కావడంతో గ్రామానికి చెందిన ఉప్పలపాటి తిరుమలబాబు(13) మరో ఇద్దరు మిత్రులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న ఎస్‌ఎస్ ట్యాంక్ వద్దకు వెళ్లారు. అక్కడ వారు ఈత కొట్టేందుకు లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలో దిగారు. తిరుమలబాబు లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి నీటిలో మునిగి పోయాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే తోటి మిత్రులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంతమంది అక్కడికి వచ్చి తిరుమలబాబును బయటికి తీసుకొని వచ్చారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడని ఆ గ్రామస్తులు తెలిపారు.
జాతీయ రహదారిపై రాస్తారోకో
గ్రామానికి అతి సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు తగిన రక్షణ లేకపోవడం వల్లనే తిరుమలబాబు మృతి చెందాడని ఆ గ్రామానికి చెందిన పలువురు ఆరోపించారు. వెంటనే ఎస్‌ఎస్‌ఎన్ ట్యాంక్‌కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, బాలుడి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు వారు జాతీయ రహదారిపై బైఠాయించి రాకపోకలను స్తంభించారు. పోలీసులు జోక్యంచేసుకొని వారిని నచ్చచెప్పి రాస్తారోకోను విరమింప చేశారు.
వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే తాటిపర్తి
ట్యాంక్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఫెన్సింగ్ లేకపోవడం వల్లే బాలుడు మృతికి ప్రధాన కారణమని, తాగేనీటికి రక్షణ కల్పించకపోవడం వలన ప్రజలకు కూడా హాని జరుగుతుందని, వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.
ట్యాంక్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలని రాస్తారోకో
అర్‌డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్


