ఒంగోలు సబర్బన్: రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు ఆదివారం ఒంగోలులో పర్యటించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) ప్రక్రియలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాల డిజిటైజేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట డీఆర్‌ఓ వెంకటరమణ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఇతర అధికారులు ఉన్నారు.
గిద్దలూరు రూరల్: మద్యం మత్తులో యువకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని కుమ్మరాంకట్టసెంటర్ సమీపంలోని సాయిఅమృత వైన్స్ వద్ద ఆదివారం జరిగింది. వైన్స్ షాపులో నుంచి యువకుడు పూటుగా మద్యం సేవించి వచ్చి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ మీద పడుకున్న ఓ సాధువును విచక్షణా రహితంగా రోడ్డుపైకి లాక్కుంటూ వచ్చి కొట్టాడు. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కొంతసేపటి తరువాత వారిని స్థానికులు రోడ్డు మీద నుంచి పక్కకు నెట్టేశారు. దీంతో రోడ్డు మీద నిలిచిన వాహనాలు వెళ్లేందుకు వీలుపడింది. మద్యం మత్తులో ఎవరిపై ఎందుకు ఘర్షణ పడుతున్నారో తెలియని అయోమయ స్థితిలో మద్యం సేవించిన వారు ప్రవర్తిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


