రోదిస్తునది! | - | Sakshi
Sakshi News home page

రోదిస్తునది!

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

పాలేరు నది ఇసుకాసురులకు ఆదాయ వనరుగా మారింది. నదికి ఒక ఒడ్డు కొండపి నియోజకవర్గంలో, మరో ఒడ్డు కందుకూరు నియోజకవర్గంలో ఉండడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదంటూ పోలీసులు పట్టించుకోక పోవడంతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. శుక్రవారం రాత్రి ఇదే తంతు జరిగింది. కొండపి నియోజకవర్గ పరిధిలోని దావగూడూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, వారి అనుచరులు పాలేరులో జేసీబీలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని చింతలపాలెం గ్రామస్తులు కందుకూరు రూరల్‌ పోలీసులకు, జరుగుమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కందుకూరు రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అయితే తవ్వకాలు జరుపుతున్నది అధికార పార్టీకి చెందిన నాయకుల మనుషులని తేలడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. జరుగుమల్లి పోలీసులైతే అటు వైపు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇక చేసేదేమీ లేక చింతలపాలెం గ్రామస్తులే ఇసుకాసురులపై ఎదురుతిరిగారు. జేసీబీతో గ్రామంలోని రక్షిత మంచినీటి పథకమైన బావి పక్కనే తవ్వకాలు జరపడం సరికాదంటూ అడ్డుకున్నారు. చింతలపాలెం గ్రామస్తులు వస్తున్నారని సమాచారం అందడంతో ట్రాక్టర్లను అక్కడ నుంచి తరలించేశారు. ఈ విషయం తెలుసుకున్న దావగూడూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తమ అనుచరులు 50 మందితో వచ్చి వారితో వాగ్వాదానికి దిగారు. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కేసు నమోదు కాలేదు..

శుక్రవారం రాత్రంతా జేబీలతో ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నా పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తవ్వకాలపై జరుగుమల్లి ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినా అటు పక్కకే రాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కందుకూరు రూరల్‌ ఎస్‌ఐ బాలకృష్ణ వచ్చి దావగూడూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులను మందలించి, యంత్రాలను తీసుకెళ్లిపోండి అని చెప్పి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐ వెళ్లిపోయిన కొద్ది సేపటి నుంచే ఇసుక తవ్వకాలు జరిపారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పాలేరు నది వద్ద తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లేముందు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని తెలిపారు.

సమస్య పరిష్కరిస్తాం..

రాత్రి నుంచి తెల్లవారే వరకు జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోని పోలీసులు శనివారం మధ్యాహ్నం ఇరుగ్రామాలకు చెందిన వారితో చర్చించారు. కందుకూరు సీఐ అన్వర్‌బాషా, రూరల్‌ ఎస్సై బాలకృష్ణ, తహశీల్దార్‌ పీ మురళి వచ్చారు. ఇరు గ్రామాల వారిని పిలిపించి నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోయారని చింతలపాలెం గ్రామస్తులు తెలిపారు. అయితే అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా వెళ్లిపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదంతా చూస్తుంటే అధికార పార్టీ నేతలకు చెందిన ఇసుక అక్రమ రవాణాదారులకు ఏవిధంగా కొమ్ముకాస్తున్నారో అర్థమవుతోందని గ్రామస్తులు అంటున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనపై కందుకూరు రూరల్‌ ఎస్సై బాలకృష్ణను వివరణ కోరగా తాను రాత్రి పాలేరు వద్దకు వెళ్లేసరికి అందరూ వెళ్లిపోయారని, పాలేరు లో ట్రాక్టరు ఇరుక్కుపోవటంతో దానిని జేసీబీతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప ఇసుక రవాణా జరగలేదని తెలిపారు. జరుగుమల్లి ఎస్సై భాగ్యరాజ్‌ను వివరణ కోరగా తనకు ఎలాంటి సమాచారం తెలియదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.

తెల్లవారుజామున టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్న దృశ్యం

తరచూ వివాదాలు

వాస్తవానికి ఇసుక వ్యాపారం కొండపి నియోజకవర్గంలో చింతలపాలెం, కందుకూరు నియోజకవర్గంలో పలుకూరు పంచాయతీలోని రామనాథపురం, వెంకన్నపాలెం గ్రామస్తులు చేసేవారు. దావగూడూరు గ్రామస్తులు మాత్రం తమ ఇంటి అవసరాలకు మాత్రమే ఇసుకను తరలించేవారు. ఇటీవల దావగూడూరు వాసులు కూడా ఇసుక వ్యాపారంలోకి రావటంతో గత కొద్ది రోజులుగా చింతలపాలెం, దావగూడూరు, రామనాథపురం, వెంకన్నపాలెం గ్రామాల మధ్య తరచూ ఇసుక వివాదాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement