జొన్న చేలో గాయాలతో పడి ఉన్న పది రోజుల పసికందు
ముండ్లమూరు: ఏ తల్లి కన్న బిడ్డో.. ఊరి చివర జొన్నచేలో గాయాలతో పది రోజుల పసికందు పడి ఉండటం చూపరులను కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆడపిల్ల భారమైందనో...మరేదైనా కారణమో తెలియదు కానీ ముండ్లమూరు గ్రామ శివారులో తాళ్లూరు వెళ్లే మార్గంలోని జొన్న చేలో పది రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. వీచే గాలులకు జొన్న చేను ఆకులు ఆ పసిపాప లేత శరీరంపై రాపిడి జరిగి రక్త స్రావం కావటం, ఆకలితో నోరెండిపోయి ఆ పసిప్రాణం బిగ్గరగా ఏడుస్తోంది. తెల్లవారు జామున గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఊరు బయట బహిర్భూమికి వెళ్లిన క్రమంలో ఏడుపు విని పాపను గుర్తించిన వారు 108లో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ముండ్లమూరు ఎస్సై ఎం కోటేశ్వరరావు, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీవీ సాగర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి పీ దినేష్ కుమార్ లకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి ఈ విషయాన్ని జిల్లా మహిళా శిక్షణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ పద్మ సునందకు తెలియజేసి వారి ఆదేశాల మేరకు పసిపాపను ముండ్లమూరు అంగన్‌వాడీ సూపర్‌వైజర్ బీ ఇంద్ర, అంగన్‌వాడీ కార్యకర్త కల్పన, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఔట్రిచ్ వర్కర్లు పాపను తమ సంరక్షణకు తీసుకుని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవ కోసం ఒంగోలు రిమ్స్ హాస్పటల్ కు తరలించారు. పాప పూర్తిగా కోలుకున్న తర్వాత ఒంగోలు రాంనగర్ లోని మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహలో చేర్పించారు. పాపను ఎవరు పడేశారు ఎందుకు పడేశారు అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపడుతున్నారు.


