● ఐదు నిమిషాల్లో మరో బోటులో మేం ఎక్కేవాళ్లం ● టూర్‌కు వెళ్లిన గొల్ల సాయి నవీన్
కందుకూరు రూరల్: వియత్నంలో బోట్ ప్రమాదం మా కళ్ల ముందే జరగడం మమ్మల్ని కలిచివేసిందని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కీర్తి సెల్ షాప్ యజమాని గొల్ల సాయి నవీన్ తెలిపారు. ‘‘లావా సెల్‌ఫోన్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన టూర్‌కు ఆంధ్ర, తమిళనాడుకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది వియత్నం టూర్‌కు ప్లాన్ చేశారు. టూర్‌కు 8వ తేదీ బయలుదేరి వెళ్లాం. వియత్నం బీచ్‌లో బోట్ షికారుకు వెళ్లేందుకు మేమంతా అక్కడికి వెళ్లాం. మొదటి బోటులో కొందరు ఎక్కి కొంత దూరం వెళ్లగానే కళ్లముందే బోటు తిరగబడటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. ప్రమాదంలో కొంతమంది చనిపోయారని తెలిసి భయభ్రాంతులకు లోనయ్యాం. మరో ఐదు నిమిషాల్లో రెండో బోటులో నాతో పాటు మరి కొందరు ఎక్కాల్సి ఉంది. ఇంతలో ఈ ప్రమాదం జరిగింద‘ని నవీన్ వాపోయారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ బి.మహాలక్ష్మిని కలెక్టర్ ఎం.విజయ సునీత సస్పెండ్ చేశారు. శనివారం ఆమె తర్లుపాడు రోడ్డులోని ఎస్సీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో వసతులు సక్రమంగా లేవని, మెనూ ప్రకారం ఆహారం అందించడంలేదని విద్యార్థులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అలాగే తాగునీటి ఆర్‌ఓ ప్లాంటు మరమ్మతులకు గురైందని, దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వంటగది, హాస్టల్ పరిసరాలు సరిగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.


