రామాయపట్నం పోర్టు ప్రజల ఆస్తి | - | Sakshi
Sakshi News home page

రామాయపట్నం పోర్టు ప్రజల ఆస్తి

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

పోర్టు పనులు 95 శాతం పూర్తి చేసిన వైఎస్సార్‌ సీపీ కందుకూరు ప్రాంత ప్రజల ఆశలను తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎంపీల చేతకానితనానికి నిదర్శనమే పోర్టు ప్రైవేటుపరం ప్రైవేటీకరణ ఆపే వరకు ప్రజల పక్షాన వైఎస్సార్‌ సీపీ పోరాటం మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ హెచ్చరిక

కందుకూరు రూరల్‌: రామాయపట్నం పోర్టు కందుకూరు ప్రజల ఆస్తి అని నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కందుకూరు ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ పోర్టును ప్రారంభించారని తెలిపారు. శర వేగంగా నిర్మించిన రామాయపట్నం పోర్టును తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తిని పప్పు బెల్లాల్లాగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ప్రాంత ప్రజల ఎన్నో సంవత్సరాల చిరకాల కోరిక సాకారమయ్యే సందర్భంలో కూటమి ప్రభుత్వం కుట్రజేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందన్నారు. అత్యంత చవకగా అమ్మటం పేద ప్రజల పట్ల ఉన్న కపట ప్రేమకు నిదర్శనమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు పూర్తయి అనుబంధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేవని అన్నారు. రామాయపట్నం పోర్టు ద్వారా ఆక్వారంగం ఉత్పత్తులు ఎగుమతై మత్స్యకార రంగానికి, రవాణా రంగానికి, చుట్టుపక్కల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరిగే పోర్టును ప్రైవేటుపరం చేయడమంత దుర్మార్గమైన విషయం మరొకటి లేదన్నారు. కందుకూరు ప్రాంత ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం, ప్రేమ ఉంటే తక్షణం చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యుడు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికపై మన్ను పోసేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వారి గెలుపునకు ఓట్లు వేసిన ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను తక్షణం ఆపాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనా కాలంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి 95 శాతం పోర్టును పూర్తి చేస్తే మిగిలిన పనులను పూర్తి చేయలేక కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు తెగనమ్మడం దుర్మార్గమైన చర్య అన్నారు. దీని వల్ల స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కమీషన్లకు కక్కుర్తి పడి పోర్టు ప్రైవేటీకరణకు అంగీకరించారని తీవ్రంగా విమర్శించారు. తక్షణం ప్రైవేటీకరణను ఆపకపోతే ఈ ప్రాంత యువత, నిరుద్యోగ, కార్మిక, కర్షక, మహిళ, మేధావులను కలుపుకొని వైఎస్సార్‌ సీపీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ప్రైవేటీకరణ ఆపే వరకు ఎన్ని ఇబ్బందులు, నిర్బంధాలు ఎదురైనా కేసులు, జైలు కూడా లెక్కచేయకుండా ఈ ప్రాంత ప్రజల హక్కు కోసం ఉద్యమిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement