నీరివ్వరా..? | - | Sakshi
Sakshi News home page

నీరివ్వరా..?

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

నీరివ్వరా..?

సాగులపడినా

కంభం:

కూటమి ప్రభుత్వంలో పాలకుల నుంచి అధికారుల వరకూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అన్నదాతను అడుగడుగునా అవస్థలకు గురిచేస్తున్నారు. పంటల సాగుకు నీరివ్వడం మొదలు.. విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం వరకూ అన్ని విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం రైతులను కష్టాలు పెడుతూనే ఉంది. తాజాగా కంభం చెరువు ఆయకట్టుకు సాగునీటి సరఫరా గురించి పట్టించుకునేవారు లేకుండా పోయారంటూ ఆయా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక కంభం చెరువు ఒకసారి నిండితే ఆయకట్టులో మూడు సంవత్సరాల పాటు పంటలు పండించవచ్చనేది నానుడి. అలాంటి చెరువులో ప్రస్తుతం సుమారు 14 అడుగుల మేర నీరుంది. ఆయకట్టు రైతులు ఒక్క కారు వరి సాగుచేసుకునేందుకు నీరివ్వాలని కోరుతూ ఇరిగేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, ఇరిగేషన్‌ అధికారులు స్పందించడం లేదు. గతంలో చెరువులో నీటి మట్టాన్ని బట్టి రైతులు పంటలు సాగుచేసుకునేందుకు అధికారులే నీరిచ్చేవారు. ప్రస్తుతం రైతులే కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై రైతులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీరిస్తారనే ఆశతో నారుమడులకు

సిద్ధం చేసుకున్న రైతులు...

కంభం చెరువులో నీరుండటంతో ఆయకట్టులో వరి సాగుకు విడుదల చేస్తారనే ఆశతో రైతులు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేశారు. తూములెత్తితే నారుమడులు వేసుకోవాలనే ఉద్దేశంతో భూములు సిద్ధం చేసుకున్నారు. కొందరు రైతులు పసుపు విత్తనాలు నాటుకుంటున్నారు. కంభం చెరువు ద్వారా కంభం మండలంలోని కంభం, చిన్నకంభం, పోరుమామిళ్లపల్లి, దర్గా, కందులాపురం, నడింపల్లి, ఔరంగబాదు, ఎల్‌.కోట, హజరత్‌గూడెం, బేస్తవారిపేట మండలంలోని జేబీకే పురం, చింతలపాలెం, సోమవారిపేట, బేస్తవారిపేట, పాపాయపల్లి గ్రామాలకు నీరందుతుంది. కంభం చెరువులో కంభం, చిన్నకంభం, పెద్దకంభం తూములుండగా.. వాటి నుంచి పంట కాలువల ద్వారా పొలాలకు నీరు చేరుతుంది.

20 రోజులుగా అన్నదాతల ప్రదక్షిణలు...

గత 20 రోజులుగా కంభ చెరువు ఆయకట్టు రైతులు వరి సాగుకు నీరివ్వాలని కోరుతూ ఇరిగేషన్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. చెరువులో నీరున్నా రైతులకు ఎందుకు వదలరంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్నామని, ఈ ఏడాది వరి సాగుచేసుకోకుంటే తినడానికి గింజలు కూడా దొరకవని వాపోతున్నారు. రైతుల పట్ల అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి నీరు వదలకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. జూలై 1 నుంచి నారుమడులు వేయాల్సి ఉండగా, ఇప్పటికీ నీరివ్వలేదని, అదును దాటిన తర్వాత పంటలు వేసుకున్నా దిగుబడులు సరిగా రావని ఆందోళన చెందుతున్నారు. అలా జరిగితే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. గతంలో ఓ మారు అదును దాటిన తర్వాత పంటలు వేసే సరికి ఎకరాకు నాలుగైదు బస్తాలకు మించి దిగుబడి రాని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

కూలీలుగా మారిపోతున్న రైతులు...

కంభం ప్రాంతం పేరు చెబితే గుర్తుకొచ్చేది కంభం చెరువు. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం పట్ల పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడా పరిస్థితులు కనబడటం లేదు. ఓ వైపు వర్షాలు లేక.. మరో వైపు కంభం చెరువులోని నీటిని పంటలకు వదలక.. నాలుగైదు ఎకరాల సొంత పొలాలున్న రైతులు సైతం కూలీలుగా మారిపోతున్నారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ప్రస్తుతం చెరువులో నీరున్నప్పటికీ.. తర్వాత తాగునీటి సమస్య ఏర్పడుతుందన్న నెపంతో వరి సాగుకు వదలకపోవడం అన్యాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెరువులో పది అడుగుల మేర నీరున్నా సాగుకు వదిలేవారని, ప్రస్తుతం 14 అడుగుల వరకూ ఉన్నాగానీ ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కంభం చెరువు ఆయకట్టులో వరి సాగుకు నీరివ్వాలని రైతుల వేడుకోలు

ఇరిగేషన్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

ఖరీఫ్‌లో అదును దాటిపోతోందంటూ ఆందోళన

కంభం చెరువులో ప్రస్తుతం సుమారు 14 అడుగుల మేర నీరు

ఆయకట్టుకు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్న ఇరిగేషన్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement