● ఎస్పీ హర్షవర్థన్‌రాజు
ఒంగోలు టౌన్: సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు సూచించారు. మిషన్ యూత్ 4 – ప్రకాశం పోలీసు హాకథాన్ 2026 కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కళ్యాణ మండపంలో శనివారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మహానగరాల్లో నిర్వహించే హ్యాకథాన్‌ను ప్రకాశం జిల్లాలో నిర్వహించడం అభినందనీమన్నారు. పోలీసు శాఖతో పాటు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాల కోసం యువత ముందుకు రావడం సంతోషించదగిన విషయమన్నారు. హ్యాకథాన్‌లో 12 సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే లక్ష్యంతో 45 జట్లు పాల్గొనడం విశేషమని, ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి యువత పాల్గొనడం స్ఫూర్తినిస్తుందని చెప్పారు. హాకథాన్‌లో రూపొందించిన పరిష్కారాలను పోలీసు శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించి పోలీసింగ్‌కు ఆచరణాత్మకంగా ఉన్న వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ హ్యాకథాన్ నిర్వహణకు స్రవింటిక్స్ టెక్నాలజీస్ ఎల్‌ఎల్‌పీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించగా, ఆర్వియాన్ లెర్నెడ్ ఎడ్జ్ ఎల్‌ఎల్‌పీ ఇంక్యూబేషన్ భాగస్వామిగా సహకారం అందించిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, రూరల్ సీఐ శేషగిరిరావు, ఐటీ కోర్ సీఐ జగదీష్, పెర్ల మహేష్ కుమార్, నార్నే వెంకట ఫణీంద్ర సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కిడ్నాప్
● జీతం అడిగినందుకు దాడి చేసి చితకబాదిన బస్సు యజమాని
● దాడి చేస్తున్నప్పుడు వీడియో చిత్రీకరించి బెదిరింపులు
● తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
సాక్షి టాస్క్‌ఫోర్స్: జీతం డబ్బులు అడిగిన పాపానికి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యజమాని బస్సు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి దాడి చేయడం కలకలం సృష్టించింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామానికి చెందిన మిడసల శ్యామ్‌కుమార్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్న అతడిని డ్రైవర్‌గా పనిచేసే స్నేహితుడైన వడకుప్ప వంశీ స్రవంతి ట్రావెల్స్ బస్సుకు హాల్టింగ్ డ్రైవర్‌గా పంపించాడు. పది రోజుల పాటు డ్యూటీ చేసిన శ్యామ్.. ఆ డ్యూటీ తాలూకు డబ్బు ఇవ్వమని ట్రావెల్స్ అధినేత సూరికి ఫోన్ చేసి అడిగాడు. నాకేం సంబంధం లేదు, నిన్ను హాల్టింగ్ డ్రైవర్‌గా పంపించిన వంశీనే అడగమని సూరి చెప్పాడు. ఈ విషయం గురించి వంశీని అడిగితే నాకు తెలియదు, బస్సు ఓనర్‌నే అడుగమని సలహా ఇచ్చాడు. దాంతో శ్యామ్ మళ్లీ బస్సు యజమాని సూరికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. దాంతో ఆగ్రహానికి గురైన ఓనర్ సూరి నువ్వు ఎవడివిరా నా కొడక.. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు. దీంతో శ్యామ్ బంధువులు కొందరు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద స్రవంతి ట్రావెల్స్ బస్సును ఆపి డబ్బులు అడిగారు. దాంతో రేపు ఇస్తానని సూరి నమ్మబలికాడు. మరుసటి రోజు శ్యామ్ మరొక బస్సుకు హైదరాబాద్ డ్యూటీకి వెళ్లి వస్తుండగా.. ఒంగోలు రాగానే ఒక పథకం ప్రకారం బస్సు ఆపాడు. బస్సులో నిద్రపోతున్న శ్యామ్‌ను కిడ్నాప్ చేసి బొలెరో వాహనంలో తీసుకెళ్లాడు. పలుచోట్ల బొలెరోను తిప్పుతూ కర్రలతో, కాళ్లతో చితకబాదారు. మూడు గంటల పాటు తిప్పిన తర్వాత మంగమూరు జంక్షన్ వద్ద శ్యామ్ తప్పించుకున్నాడు. శ్యామ్‌ను బస్సు ఓనర్ సూరి కొడుతున్నప్పుడు వీడియో చిత్రీకరించి ఆ వీడియోలను శ్యామ్ వాట్సాప్‌కు పంపించారు. నిన్ను చంపేస్తామని, నీకు చేతనైంది చేసుకోమంటూ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


