ముండ్లమూరు: నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు ధ్వంసం చేసి వాటిలోని రాగి తీగను చోరీ చేసిన సంఘటన శుక్రవారం రాత్రి ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన బిజ్జం రమణారెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, మేడగం శ్రీనివాసరెడ్డికి గ్రామానికి దక్షిణం వైపు పొలాలున్నాయి. వాటిలో ఏర్పాటు చేసుకున్న 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను దిమ్మెలపై నుంచి కిందికి దించిన దొంగలు.. వాటిని పగలగొట్టి లోపలున్న రాగి తీగను చోరీ చేశారు. శనివారం ఉద యాన్నే పొలాలకు వెళ్లిన రైతులు గమనించి ముండ్లమూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం పోలీసులు సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించింది.
పొదిలి: మురుగు కాలువలో పడి యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం పొదిలి పట్టణంలోని బుగ్గచలం ట్యాంకు వద్ద జరిగింది. స్థానికంగా నివాసం ఉండే గుర్నాథం సుధాకర్ కుమారుడు రాజేష్ (19) పాల వాహనం పనికి పోతుంటాడు. శనివారం కూడా బండికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం కూడా పోలీస్‌స్టేషన్ పరిసరాల్లో కనిపించినట్లు పలువురు చెబుతున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ మురుగు కాలువలో బోర్లాపడి మృతిచెంది ఉన్నాడు. కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రాజేష్ చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


