యర్రగొండపాలెం: ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మ్యాపింగ్‌ను మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారి ఓట్లను గుర్తించి త్వరితగతిన మ్యాపింగ్ చేయాలన్నారు. శుక్రవారం పెద్దారవీడు మండలం బి.చెర్లోపల్లి గ్రామంలో శ్రీసర్‌శ్రీ ప్రక్రియపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామంలో మొత్తం 1,816 ఓట్లకు గాను ఇంకా 207 ఓట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే గుర్తించి మ్యాపింగ్ చేసేలా బీఎల్‌ఓ, బీఎల్‌ఏలు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానికంగా ఓటు ఉన్నవారికి మాత్రమే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, ఇతర లబ్ధి అందుతాయన్న విషయాన్ని వలస వెళ్లిన వారికి వివరించాలన్నారు. మరో ప్రాంతంలో ఓటు పొందే అవకాశం కూడా ఉండదని, ఈ విషయమై దూరప్రాంతాల్లో ఉన్నవారికి అవగాహన కల్పించి శ్రీసర్‌శ్రీలో భాగస్వాములను చేయాలని సూచించారు.
కొత్త ఓటర్లకు అవకాశం
2002 జాబితాలో మ్యాపింగ్ కాని వారు.. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి దరఖాస్తుకు జత చేసి ఓటు హక్కు పొందవచ్చని ఎమ్మెల్యే వివరించారు. అలాగే, 18 ఏళ్లు నిండిన యువతకు కొత్తగా ఓటు హక్కు పొందే అవకాశం ఉందని, వారి అర్జీలను పరిశీలించి ఓటరుగా నమోదు చేయాలన్నారు.
డిజిటలైజేషన్ నత్తనడక
నియోజకవర్గంలో మొత్తం 2,08,318 మంది ఓటర్లకు ‘సర్’ ఫారాలు పంపిణీ చేయగా, ఇప్పటివరకు కేవలం 1,69,182 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ చేసినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నత్తనడక తీరుతో నిర్దేశిత గడువులోగా ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కావడం లేదని ఆయన పెదవి విరిచారు. గ్రామాల్లోని బీఎల్‌ఓలు పూర్తి సమయం కేటాయించి, బాధ్యతాయుతంగా డిజిటలైజేషన్ వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బీఎల్‌ఓలు రవితేజ, దయానిధి, బీఎల్‌ఏలు ఎం.కోటేశ్వరరావు, కె.వెంకటేశ్వరరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు సుబ్బారెడ్డి, పెద్దారవీడు, యర్రగొండపాలెం మండలాల పార్టీ అధ్యక్షులు పాలిరెడ్డి కృష్ణారెడ్డి, ఏకుల ముసలారెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, ఇంటిలెక్చువల్ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల ఆదినారాయణ, స్థానిక నాయకులు మూల లక్ష్మీరెడ్డి, మూల జగదీశ్వరరెడ్డి, ఒద్దుల లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థానికంగా ఓటు ఉంటేనే ప్రభుత్వ పథకాల లబ్ధి
కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి
డిజిటలైజేషన్ నత్తనడకపై ఎమ్మెల్యే అసంతృప్తి
బి.చెర్లోపల్లిలో ‘సర్’ ప్రక్రియపై అవగాహన సదస్సు


