బేస్తవారిపేట: మద్యంతో పాటు ఇతర చెడు వ్యసనాలకు బానిసై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కంభం సీఐ మల్లికార్జున తెలిపారు. శుక్రవారం బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను వారు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా నల్లతుమ్మాయపల్లికి చెందిన గురునాధం బ్రహ్మయ్య ఊళ్ల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేస్తూ ప్రస్తుతం కనిగిరి మండలం రామాయపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఇతను వరుసకు బావ అయిన నాగులూరి నాగరాజుతో కలిసి గత నెల 18న బేస్తవారిపేట మండలం పాపాయిపల్లెలో, 2025లో ముండ్లమూరు మండలం పెద్ద పుల్లగల్లు, పూరిమెట్ల గ్రామాల్లో ఇళ్ల ముందు నిద్రిస్తున్న మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు అపహరించాడు. అలాగే నాగులుప్పలపాడు మండలంలో ఓ దుకాణంలో నగదు చోరీ చేశాడు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై శివకృష్ణారెడ్డిల బృందం గురువారం సాయంత్రం కోనపల్లె అడ్డరోడ్డు వద్ద నిందితుడు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుంది. అతని నుంచి రూ.10 లక్షల విలువైన మూడు బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదును రికవరీ చేశారు. నిందితుడిపై గతంలో తెలంగాణ రాష్ట్రంలోని రేపల్లి, తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, డక్కిలి, సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొన్న కానిస్టేబుళ్లు ఎం.వెంకటేశ్వర్లు, ఎం.అంకయ్య, మరో వెంకటేశ్వర్లుకు క్యాష్ రివార్డులు అందజేశారు.
యువకుడిని కటకటాల్లోకి నెట్టిన పోలీసులు
రూ.10 లక్షల విలువైన నగలు, రూ.30 వేల నగదు రికవరీ
వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు


