సింగరాయకొండ: ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని వృద్ధుడు(65) మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని సోమరాజుపల్లి రైల్వేగేటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. రైల్వే జీఆర్‌పీ పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి నుంచి పూరీ వెళ్తున్న రైలు సోమరాజుపల్లి రైల్వేగేటు సమీపంలోకి రాగానే, పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి జేబుల్లో ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడు చామనఛాయ రంగుతో సుమారు 5.7 అడుగుల ఎత్తు ఉన్నాడు. ఆకాశరామన్న రంగు (స్కై బ్లూ) నిండు చేతుల చొక్కా, బ్లూ, బ్లాక్, తెలుపు రంగుల చిన్న చెక్స్ ఉన్న లుంగీ, నీలం, తెలుపు రంగులోని గళ్ల టవల్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు జీఆర్‌పీ ఎస్సై శ్రీరామ్ వెల్లడించారు.
● రూ.58,680 నగదు స్వాధీనం
యర్రగొండపాలెం: మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామ శివారులోని పొలాల్లో పేకాట (కోతముక్క) ఆడుతున్న స్థావరంపై పోలీసులు శుక్రవారం మెరుపు దాడి చేశారు. పక్కా సమాచారంతో నిర్వహించిన ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.58,680 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ తెలిపారు. పట్టుబడిన పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
యర్రగొండపాలెం: మండలంలోని హనుమంతుని చెంచుగూడేనికి చెందిన గిరిజన మహిళ, అంగన్‌వాడీ టీచర్(31) అదృశ్యమైనట్లు ఎస్సై ఎం.దేవకుమార్ శుక్రవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. సదరు మహిళ గత నెల 28వ తేదీన యర్రగొండపాలెం వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. రాత్రి అయినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె తండ్రి భూమని ఈదన్న శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


