సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ దిగ్బంధం వేతనాలు పెంచేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసిన నాయకులు భారీగా మోహరించిన పోలీసులు
ఒంగోలు టౌన్: వేతనాల పెంపుదల, పనిఒత్తిడి తగ్గింపు, ప్రీస్కూలు బలోపేతం, బకాయిల చెల్లింపు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు ఒంగోలు కలెక్టరేట్‌ను దిగ్బంధించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీలు చేపట్టిన ధర్నాకు పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన అంగన్‌వాడీలు కలెక్టరేట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, టూ టౌన్ ఎస్సై పున్నారావు ఆధ్వర్యంలోని పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన గేట్లను మూసివేయడంతో పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట జరిగింది. దాంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్‌వాడీలు చేసిన నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు దద్దరిల్లాయి. కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇవ్వాలని అంగన్‌వాడీ యూనియన్ నాయకులు పట్టుబట్టారు. కలెక్టరేట్ గేట్లను మూసి వేసి అడ్డుకోవడంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా అంగన్‌వాడీలు గేట్ల వద్దనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీల వేతనాల పెంపు కోసం 42 రోజులపాటు చేసిన సమ్మె తాలూకు బకాయిలు వెంటనే చెల్లించాలని, తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని గత రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు బడ్జెట్లు పెట్టినా అంగన్‌వాడీల వేతనాల పెంపుపై కనీసం చర్చించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్పర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టమని చెప్పారు. పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాాట్యుటీ, వేతనంతో కూడిన సెలవులతో సహా అంగన్‌వాడీలకు సామాజిక, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు అద్దెలు, విద్యుత్ బిల్లులు, ప్రయాణ వ్యయాలు, అదనపు గ్యాస్ సిలిండర్ల ఖర్చును స్వంత జీతాల నుంచి భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ మాట్లాడుతూ అంగవాడీల సమస్యలను పరిష్కరించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జీవీ కొండారెడ్డి, కాలం సుబ్బారావు, యూనియన్ నాయకురాళ్లు జయప్రద, ధనలక్ష్మి, హమీమా, రాజేశ్వరి, క్రాంతి, పద్మావతి, శారద, శేషమ్మ, మస్తాన్ బి, వరలక్ష్మి, చిన్నమ్మాయి, ఆదిలక్ష్మి, మంజుదార్, జి.వెంకటేశ్వర్లు, టి.రాము, మహేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
మార్కాపురం: జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీలకు కనీస వేతనాల కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ఆందోళన చేశారు. శుక్రవారం అంగన్‌వాడీలు డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ శివరామిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని, అంగన్‌వాడీలపై పనిభారం తగ్గించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలనాగయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. యూనియన్ నాయకులు ఆర్డీఓ శివరామిరెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆవులయ్య, మాలకొండయ్య, రూబెన్, సురేష్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు లక్ష్మి, ప్రభావతి, రమ, మల్లేశ్వరి, అరుణకుమార్, భారతి తదితరులు పాల్గొన్నారు.


