కోడలి వేధింపుల నుంచి కాపాడమన్న వృద్ధురాలికి ఓ ఏఎస్సై తీవ్ర అన్యాయం విలేకరుల ఎదుట బాధితురాలు ఆవేదన
లంచం ఇచ్చినా
సాక్షి టాస్క్‌ఫోర్స్: కోడలు బారి నుంచి కాపాడి తన పొలం తనకు తిరిగి ఇప్పించేందుకు ఓ వృద్ధురాలి నుంచి రూ.55 వేలు లంచం తీసుకున్న ఓ ఏఎస్సై చివరికి ఆ పని చేయకపోగా అదిగో ఇదిగో అంటూ రోజుల తరబడి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటూ ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్న ఘటన ఇది. తనకు పోలీసులు తీరని అన్యాయం చేశారని కనిపించిన వారందరికీ ఆ వృద్దురాలు చెప్పుకుంటోంది. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వస్తే డబ్బులు తీసుకుని అన్యాయం చేస్తున్నారని కన్నీరుమున్నీరై విలపిస్తోంది. ముండ్లమూరు మండలం కొక్కెర కొండయ్యపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు సంపతి వెంకటమ్మ తెలిపిన వివరాల ప్రకారం..
వెంకటమ్మకు గ్రామంలో తొమ్మిది ఎకరాల పొలం ఉంది. ఇద్దరు కుమారులకు ఏడు ఎకరాలు ఇచ్చి తన బతుకుదెరువు కోసం రెండెకరాలు ఉంచుకుంది. అయితే, పెద్ద కొడుకు చనిపోవడంతో పెద్ద కోడలు మిగిలిన రెండెకరాలు కూడా తనవేనంటూ అడ్డం తిరిగింది. తనను కొట్టి పొలంలోకి ఎవరూ రాకుండా అడ్డుకుందని వెంకటమ్మ ఆరోపిస్తోంది. అలాగే, తాను ఉంటున్న ఇల్లు కూడా తనదేనంటూ పెద్దకోడలు బయటకు గెంటేసిందని వాపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని వెంకటమ్మ దర్శి సీఐ రామారావును ఆశ్రయించింది. ఆయన ఏఎస్సైను కలవాలని పంపించారు. దీంతో ముండ్లమూరు ఏఎస్సై పవన్‌ను వెంకటమ్మ కలిసింది. న్యాయం చేయాలంటే డబ్బులు ఇవ్వాలని ఆయన బేరం పెట్టాడని, దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో రూ.55 వేలు ఇచ్చినట్లు వెంకటమ్మ తెలిపింది. ఆ తర్వాత ఆమె తనకు న్యాయం జరుగుతుందన్న ఆశతో రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. కొత్త ఎస్సైగారు వస్తున్నారు.. నీకు న్యాయం చేస్తారని ఏఎస్సై నెలరోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. రోజూ రావడం, స్టేషన్ మెట్లపై కూర్చుని వెళ్తున్నట్లు ఆమె తెలిపింది. కొత్త ఎస్సై వచ్చాక ఆయన్ను కలవాలని ప్రయత్నించగా కలవనీయకుండా రేపు రా.. ఎల్లుండి రా.. అంటూ వెనక్కు పంపుతున్నారని ఆమె వాపోయింది. దీంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీక బాధితురాలు శుక్రవారం విలేకరులను సంప్రదించింది. ఏఎస్సై తన వద్ద తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడంలేదని, తనకు న్యాయం చేయడంలేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఉన్నతాధికారులు స్పందించి తనకు తగు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది.


