మద్దిపాడు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ధర్నాలు చేయడానికి సన్నద్ధమవుతున్నామని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఈనెల 16వ తేదీన కనిగిరిలో, 17వ తేదీ ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించ తలపెట్టినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ధర్నాకు పొగాకు రైతులందరూ తరలి రావాలని కోరారు. వారం రోజుల క్రితం కడుపు మండిన రైతులు వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో వేలం నిలిపేసినా వారి గోడు పట్టించుకునే వారు లేరని, కలెక్టర్ వచ్చినా కంపెనీల వారికి పట్టదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎప్పుడో చేతులెత్తేశాడని, ముఖ్యమంత్రి చంద్రబాబు కేజీ రూ.200కు తక్కువకు కొనుగోలు చేయడానికి వీలులేదని చెప్పినా కంపెనీల వారు ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో జిల్లాలో పొగాకు రైతులు ఉన్నారని, పంటలో నష్టం వస్తే తీవ్రంగా నష్టపోయేది ఇక్కడివారేనన్నారు. ఇటీవల మంత్రి గొట్టిపాటి రవి, పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారిలు వేలం కేంద్రాన్ని సందర్శించిన క్రమంలో నోబిడ్‌లు ఉండకూడదంటూ గట్టిగా వ్యాపారులకు చెప్పినా వారు వినిపించుకునే పరిస్థితి లేకుండాపోయిందని విమర్శించారు. ఇందరు చెప్పినా కంపెనీల వారు వారికి నచ్చిన రేటు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎఫ్–1 బేళ్లకు కేజీ రూ.240 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, ఎఫ్–2, ఎఫ్–3 రకం బేళ్లు రూ.160 నుంచి రూ.170 మధ్యలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రైతులకు ఎఫ్–1 రకం బేళ్లు తక్కువగా వస్తాయి. పంటలో ఎక్కువ శాతం ఎఫ్2, ఎఫ్–3 రకం బేళ్లు వస్తాయని చెప్పారు. ఇక లోగ్రేడు పొగాకు కొంటారో కొనరో తెలియని స్ధితి, కొంటే ఎంతకు కొంటారో అన్న విషయంపై రైతులలో ఆందోళన నెలకొందని, దీని వలన పొగాకు రైతుకు సరాసరి రూ.200 వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇదేవిధంగా వేలం కొనసాగితే ఒక బ్యారన్‌కు సుమారు రూ.5 లక్షలు నష్టం వచ్చే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.250 కోట్లతో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి వ్యాపారుల సిండికేట్‌ను బద్దలు చేశారని, దీంతో రైతులకు మంచి ధర లభించడమే కాకుండా రైతుల కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు రైతు సంఘాలు, ఇతర పార్టీలను కలుపుకుని గతంలో పొదిలిలో పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్ జగన్ వచ్చిన సంగతి ఆయన గుర్తు చేశారు. ప్రశ్నిస్తే కేసులు, ధర్నాలు చేస్తే నాయకులపై కేసులు పెడుతున్నారని, ఎంతకాలం ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతారంటూ ఆయన మండిపడ్డారు.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 16వ తేదీ కనిగిరిలో, 17న ఒంగోలు కలెక్టరేట్ వద్ధ ధర్నాలు
మాజీ మంత్రి మేరుగు నాగార్జున


