● గొంతులో పొడవడంతో పరిస్థితి విషమం
ఒంగోలు టౌన్:
గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన ఒక వ్యక్తి చాకుతో దాడి చేయడంతో బాధితుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... మద్దిపాడు మండలం నేలటూరు గ్రామానికి చెందిన వడియాల సుబ్బారావు ఒంగోలులో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. గురువారం ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఒక టీ స్టాల్ వద్ద కూర్చుని ఉండగా, చీమకుర్తి మండలం నిప్పట్లపాడు గ్రామానికి చెందిన పొన్నూరు ప్రసాద్ అక్కడకు వచ్చాడు. అప్పటికే ప్రసాద్ గంజాయి సేవించి ఉన్నాడు.
దానికితోడు మద్యం తాగి ఉన్నాడు. టీ స్టాల్ వద్ద సుబ్బారావుకు, ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. గంజాయి, మద్యం మత్తులో ఉన్న ప్రసాద్.. పక్కనే ఉన్న కత్తి తీసుకుని దాడికి పాల్పడ్డాడు. సుబ్బారావు మెడ మీద కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో పడిపోయిన సుబ్బారావును వెంటనే ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం సుబ్బారావు పరిస్థితి విషమంగా ఉంది. దాంతో అతడిని మెరుగైన చికిత్స కోసం స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడు.


