అన్నదాతపై ఎరువుల పిడుగు! | - | Sakshi
Sakshi News home page

అన్నదాతపై ఎరువుల పిడుగు!

Jul 10 2026 7:34 AM | Updated on Jul 10 2026 7:34 AM

కొండపి:

ప్రకృతి ప్రకోపాలు, మద్దతు ధర లేక అగచాట్లు.. వెరసి వ్యవసాయం అంటేనే ఇప్పుడు పీడకలగా మారింది. ఆరుగాలం కష్టపడినా పెట్టిన పెట్టుబడి సైతం చేతికందని దుస్థితిలో ఉన్న రైతులను ఎరువుల ధరల పెంపు మరింత పాతాళానికి నెట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం కుంటుపడటమే కాకుండా, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో అన్నదాతలు ఆందోళనలో మునిగిపోయారు.

జిల్లాలో నైరుతి రుతుపవనాల కారణంగా ఆశించిన వర్షం కురవలేదు కానీ అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడుతుండటంతో ఖరీఫ్‌ సాగుకు రంగం సిద్ధమైంది. విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధమవుతుండగా, ఎరువుల షాపుల ముందు కనిపిస్తున్న ధరల పట్టికలు వారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. యూరియా, డీఏపీ ధరల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, పంట దిగుబడికి ప్రాణాధారమైన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. బస్తాకు రూ.300 నుంచి ఏకంగా రూ.700 వరకు ధరలను పెంచేయడంతో, సాగు ఖర్చు ఊహించని విధంగా తడిసి మోపెడవుతోంది.

బ్లాక్‌ మార్కెట్‌ దందా

ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఎరువుల కొరతను సాకుగా చూపుతూ కొందరు డీలర్లు బ్లాక్‌ మార్కెట్‌కు తెరలేపారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. అధిక ధరలు చెల్లిస్తేనే ఎరువులు దొరుకుతున్నాయని, లేదంటే నిల్వలు లేవని సమాధానం వస్తోందని రైతులు వాపోతున్నారు. పాలన గాలికి వదిలేసిన సర్కారు, ఎరువుల పంపిణీలో కనీస పర్యవేక్షణ కూడా చేయడం లేదు.

పగ్గాల్లేని దోపిడీ

కేంద్ర ప్రభుత్వం కేవలం కొన్ని ఎరువులకే రాయితీని పరిమితం చేసి, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను నిర్ణయించే అధికారాన్ని తయారీ కంపెనీలకే వదిలేసింది. దీంతో కంపెనీలు ఇష్టానుసారంగా ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయి. అసలే గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నకు, ఇప్పుడు పెరిగిన ఎరువుల ధరలు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారాయి. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పెట్టుబడి భారం పెరగడంతో, వ్యవసాయం వదిలేయాలన్న ఆలోచన వారిలో వ్యక్తమవుతోంది.

అన్నదాతల ఆక్రందన

‘పంట వేస్తే ఎరువులు దొరకవు, దొరికితే కొనే ధర ఉండదు. మరి మేం సాగు చేయడం ఎందుకు’ అని అన్నదాతలు రోదిస్తున్నారు. పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించి, ప్రకటనలకే పరిమితం కావడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని, ఎరువుల ధరల పెంపును నిలుపుదల చేయాలని, బ్లాక్‌ మార్కెట్ను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement