దర్శి: దేవాలయాల్లో వరుస చోరీలు, రాత్రిపూట ఇళ్లలో, షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వై.రామారావు తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. సీఐ రామారావు ఆధ్వర్యంలో తాళ్లూరు ఎస్సై మల్లికార్జునరావు, దొనకొండ ఎస్సై రామకృష్ణలు తమ సిబ్బందితో కలిసి నిందితులను అరెస్టు చేసి సుమారు రూ.3.50 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఇత్తడి గంటలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి తాళ్లూరు మండలం నాగంబొట్లవారిపాలెం శివారులోని కాటమరాజు దేవాలయంలో ఇత్తడి గంటలు చోరీకి గురైన ఘటనపై తాళ్లూరు ఎస్సై మల్లికార్జునరావు కేసు నమోదు చేసి పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచారు. నిందితుడు పొదిలికి చెందిన పొదిలి నరసింహారావును అదుపులోకి తీసుకుని విచారించగా కాటమరాజు గుడిలో ఇత్తడి గంటలు దొంగతనం చేసినట్లు తేలింది. అంతేగాక దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగినపూడి శివాలయంలో హుండీ పగులగొట్టి వెయ్యి నగదు, నల్లబోతువారిపాలెంలోని పోలేరమ్మ దేవాలయంలో హుండీ పగులగొట్టి రూ.10 వేల నగదు అపహరించినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.60 వేల విలువైన 40 ఇత్తడి గంటలు (సుమారు 50 కిలోల బరువు) స్వాధీనం చేసుకున్నారు. పొదిలి పట్టణంలో జరిగిన ద్విచక్ర వాహనం చోరీ కేసులో కూడా ఇదే నిందితుడి ప్రమేయం ఉన్నట్లు తేలింది. రూ.90 వేల విలువైన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పొదిలి నరసింహారావుపై గతంలో వివిధ పోలీస్‌స్టేషన్లలో సుమారు 40 చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరో కేసులో దొనకొండ ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో కలిసి దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన మేకల ధనరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 3వ తేదీన దొనకొండలోని ఒక కొరియర్ కార్యాలయంలో రూ.50 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు తేలింది. పడమటి వెంకటాపురం గ్రామంలో పగటి సమయంలో ఒక ఇంట్లో చొరబడి 8 గ్రాముల నల్లపూసల దండ, 4 గ్రాముల చెవి దిద్దులు, రూ.50 వేల నగదు దొంగిలించినట్లు గుర్తించారు. ఈ రెండు కేసుల్లో నిందితుల నుంచి రూ.45 వేల నగదు, మొబైల్ ఫోన్, నల్లపూసల దండ, చెవి దిద్దులు కలిపి సుమారు రూ.2 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను దర్శి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని సీఐ రామారావు వివరించారు. కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన దర్శి సీఐ రామారావు, తాళ్లూరు ఎస్సై మల్లికార్జునరావు, దొనకొండ ఎస్సై రామకృష్ణ, పోలీసు సిబ్బంది నాయక్, శ్రీను, గిరి, మహేష్, మాలకొండయ్యలను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. దేవాలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాలను మరింత సమర్థంగా అరికట్టవచ్చని సీఐ రామారావు వివరించారు.
మొత్తం రూ.3.50 లక్షల సొత్తు స్వాధీనం
నిందితుల వివరాలు వెల్లడించిన దర్శి పోలీసులు


