కొనకనమిట్ల: మండలంలోని గొట్లగట్టు రామాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయానికి చెందిన అత్యంత పురాతనమైన, రూ.లక్షల విలువ చేసే పంచలోహ ఉత్సవ విగ్రహాలను అపహరించుకుపోయారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. రామాలయం వెనుక ఉన్న కల్యాణ మండపం ఆవరణలో రామనవమి ఉత్సవాల్లో స్వామివారిని ఊరేగించే హనుమంత, గరుడ వాహన విగ్రహాలను ఉంచేవారు. పంచ లోహాలతో రూపొందించిన ఈ విగ్రహాలపై కన్నేసిన దుండగులు బుధవారం రాత్రి వేళ మాటువేసి మరీ చోరీకి పాల్పడ్డారు. కళ్యాణ మండపం వెనుక భాగం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు, హనుమంత వాహనాన్ని బల్లపై నుంచి తొలగించి తీసుకెళ్లారు. గరుడ వాహనాన్ని కూడా అపహరించే క్రమంలో చేయి విరగ్గొట్టి మరీ తీసుకెళ్లినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ విగ్రహాల విలువ మార్కెట్‌లో సుమారు రూ.20 లక్షలకు పైగానే ఉంటుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు.
పనిచేయని సీసీ కెమెరాలు
ఆలయంలో గతంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, అవి ఇప్పుడు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ఎవరికీ తెలియని పరిస్థితి. నిఘా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే ఈ దొంగతనాలకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇదే రామాలయంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలు చోరీకి గురైన ఘటనను గుర్తుచేస్తూ, ఆలయ భద్రతపై అధికారుల నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థమవుతోందని పేర్కొంటున్నారు. సీసీ కెమెరాలు పనిచేస్తే దొంగల ఆమూకీ కనుగొనే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పంచలోహ హనుమంత,
గరుడ వాహనాలపై దొంగల కన్ను
రూ.20 లక్షల విలువైన విగ్రహాల
అపహరణ!
సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై గ్రామస్తుల అసహనం


