కొత్తపట్నం: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన యువకుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రం కొత్తపట్నంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపట్నం గ్రామానికి చెందిన పులి భద్రినారాయణ (22) కూలి పనులు చేస్తుంటాడు. స్థానిక చైతన్య స్కూల్ దగ్గరలో అదే గ్రామానికి చెందిన బొబ్బాల శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు జీతానికి చేరాడు. మూడేళ్ల నుంచి ఆయన దగ్గరే జీతానికి పనిచేస్తున్నాడు. ఇసుక మెట్ట భూమి అందులో పశువులకు కావాల్సిన గడ్డి పెంచుతున్నాడు. ఎప్పటిలాగే ఆ గడ్డికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు వేసి నీరు పెడుతున్నాడు. ఇంతలో కరెంట్ పోయింది. మళ్లీ కరెంట్ వచ్చిన వెంటనే మోటార్ వేసేందుకు వెళ్తూ విద్యుత్ తీగ గడ్డిలో తెగిపడిపోయి ఉండగా దానిపై కాలు వేశాడు. ఆ వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి మృతుడి తండ్రి పులి శ్రీనుకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్ లైన్‌మెన్ శ్రీనివాసరావు ట్రాస్‌ఫార్మర్ ఆపి విద్యుత్ తీగలను తొలగించారు. ఎస్సై సుధాకర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చేతికి వచ్చిన కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
సింగరాయకొండ: వెూటారు సైకిల్ అదుపుతప్పి రావినూతల కృష్ణ (49) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని శానంపూడి చెరువు వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బేల్దారి పనిచేస్తున్న శానంపూడికి చెందిన కృష్ణ పనిపై సింగరాయకొండ వచ్చి మధ్యాహ్నం భోజనం కోసం బైకుపై స్వగ్రామం వెళ్తున్నాడు. చెరువు మలుపు వద్ద మోటారు సైకిల్ ప్రమాదవశాత్తు అదుపు తప్పడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న రావినూతల సుధీర్, రావినూతల వంశీలు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్‌కుమార్ వివరించారు.


