సింగరాయకొండ: మండలంలోని పాతసింగరాయకొండ నరసింహస్వామి దేవస్థానం సమీపంలోని బావిలో అంకం రాహుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును అత్యాధునిక సాంకేతికతతో ఛేదిస్తామని ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన రాహుల్ మృతదేహాన్ని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తించామన్నారు. కేసును సీఐ శ్రీహరి నేతృత్వంలో వేగంగా దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అంతకుముందు రాహుల్ మృతదేహం లభ్యమైన బావిని ఎస్పీ పరిశీలించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్సై ఎల్.సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● రూ.4 లక్షల విలువైన గొలుసు అపహరణ
మర్రిపూడి: మండలంలోని జువ్విగుంట స్టేట్‌బ్యాంక్ సమీపంలో మంగళవారం ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ధర్మవరం గ్రామానికి చెందిన బాధితురాలు బారెడ్డి కొండమ్మ బ్యాంకు పనిపై ఎక్స్‌ఎల్ వాహనంపై వెళ్తుండగా, జువ్విగుంట శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన ఇద్దరు అగంతకులు కొండమ్మను అడ్డగించి, శ్రీచిలంకూరుకు దారి ఎటు?శ్రీ అని అడిగారు. ఆమె సమాధానం చెప్పేలోపే, వెనుక కూర్చున్న దుండగుడు మెడలోని సుమారు 4 లక్షల విలువైన బంగారు గొలుసును లాక్కొని పొదిలి వైపు పరారయ్యారు. బాధితురాలు కేకలు వేస్తూ వెంటపడినా ఫలితం లేకపోయింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హెల్మెట్ ధరించగా, వెనుక కూర్చున్న వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకోవడంతో వారిని గుర్తించలేదని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం వైజంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయవరం గ్రామానికి చెందిన గాయం వెలుగొండారెడ్డి (70) మృతి చెందారు. స్కూటీపై పట్టణంలోకి వస్తున్న వెలుగొండారెడ్డిని ఎదురుగా వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. భార్య సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేశారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం ఉదయం మార్కాపురం పట్టణానికి వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి శవమై రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ట్రాక్టర్ బోల్తాపడి ఇంజినీరింగ్ విద్యార్థి..
లింగసముద్రం శాయిపేటలో ట్రాక్టర్ పంక్చర్ వేయించుకుని వస్తుండగా, అది అదుపుతప్పి కాలువలో బోల్తా పడటంతో రాళ్లపాడు గ్రామానికి చెందిన పొడపాటి ప్రసాద్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్ కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పంక్చర్ వేయించుకుని వస్తానని చెప్పి వెళ్లిన కొడుకు విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వాహనం ఢీకొని పాదచారుడు..
అద్దంకి: స్థానిక నామ్ రహదారిపై అన్న క్యాంటీన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రామ్‌నగర్‌కు చెందిన శ్రీను అనే పాదచారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనును వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు టౌన్: ఒంగోలు రైల్వే స్టేషన్‌లో మంగళవారం పోలీసులు, రైల్వే భద్రతా దళాలు చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సీసీఎస్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ఒంగోలు మీదుగా సింగరాయకొండ వైపు వెళ్తున్న పూరీ ఎక్స్‌ప్రెస్‌లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రైలులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒడిశాకు చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, సమాచారం ఉన్న వారు 1972, 112 లేదా వాట్సాప్ నంబర్ 9121102266కు ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు. తనిఖీల్లో ఎస్సైలు శ్రీరామ్, చెంచయ్య, ఏఎస్‌ఐ మహబూబ్ బాషా పాల్గొన్నారు.


