● నిందితుడిపై పోక్సో కేసు నమోదు
అద్దంకి రూరల్: మైనర్ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి, ఆ సంభాషణను రికార్డు చేసిన ఇద్దరు వ్యక్తులు.. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితులు సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, మంగళవారం కేసు నమోదైంది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఐ సుబ్బరాజుకు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు పులి వికాస్, కిరణ్‌కుమార్, బాలిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మార్కాపురం టౌన్: ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి ఎస్.కె.మహమ్మద్ ఖాశీం తెలిపారు. డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి రెండు నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోపు ఒంగోలులోని ఏపీబీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9989285530, 8985090926ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
● ఎన్‌హెచ్ పీడీ అనిల్‌కుమార్ రెడ్డి
టంగుటూరు: జాతీయ రహదారి(ఎన్‌హెచ్ 16) పక్కన ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, వెంచర్ల యజమానులు అప్రోచ్ రోడ్ల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ బాటలను తొలగించే ప్రక్రియను మంగళవారం టోల్ ప్లాజా వద్ద ఆయన పర్యవేక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, విజయవాడ ఆర్‌ఓ సూచనల మేరకు సింహపురి ఎక్స్‌ప్రెస్ వే అధికారులతో కలిసి అక్రమంగా నిర్మించిన బాటలను జేసీబీతో తొలగించారు. అనుమతి లేకుండా రోడ్ల పక్కన వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఇకపై నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ హెడ్ జైరామ్ అమర్ బాబు, పోలీస్, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: ఎమ్మార్పీ ధరకే రైతులకు ఎరువులు అందజేయాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలో ఎరువుల నిల్వలు, ధరలపై వ్యవసాయ అధికారులు, డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులకు యాప్ ద్వారా మాత్రమే ఎరువులు ఇవ్వాలని, అదే సమయంలో బిల్లులు అందజేయాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రసాయనిక ఎరువులు వాడకం తగ్గించడంతోపాటు నానో ఎరువులు, జీవ ఎరువులు, సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ ఇన్‌చార్జి అధికారి బాలాజీ నాయక్, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం ఏడిఏలు రాజశ్రీ, జైనులాబ్దిన్, వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
● నడి రోడ్డుపై పడి గొంతెండి ఒకరు మృతి
గిద్దలూరు రూరల్: మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన దిగువమెట్ట గ్రామంలోని చెంచుకాలనీ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గుర్తుతెలియని వ్యక్తి మద్యం మత్తులో చెంచుకాలనీ సమీపంలో సంచరిస్తూ రోడ్డుపై బోర్లా పడిపోయాడు. అతడిని ఎవరూ పట్టించుకోకపోవడంతో గొంతు ఎండి మరణించాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉంటుందని, నలుపు రంగు ప్యాంట్ ధరించి, చొక్కా లేకుండా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడికి నోటి వెంట రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.


