సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికార పార్టీ అండ ఉందని, కూటమి నాయకులు చెలరేగిపోతున్నారు. భూ వివాదం పేరుతో జనసేన మండల అధ్యక్షుడు కేతినేని మురళి తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాలలో వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ నిర్వహిస్తున్న హోటల్‌పై దాడి చేసి, బీభత్సం సృష్టించారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు.. పెద్దదోర్నాలలో జాతీయ రహదారి పక్కన కేతినేని మురళికి చెందిన స్థలంలో అబ్దుల్ మజీద్ హోటల్ నిర్వహిస్తున్నారు. లీజు గడువు ఇటీవల ముగిసింది. అయితే తాను కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన హోటల్‌ను మరి కొంతకాలం కొనసాగించనివ్వాలని మజీద్ విజ్ఞప్తి చేయగా మురళి అంగీకరించలేదు. ఉన్నపళంగా స్థలాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఇరువర్గాలు కలిసి చర్చించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొంత మంది వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడ వేచి ఉండగా.. మురళి తన అనుచరులతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన దాదాపు 20 మంది మహిళలను వెంటబెట్టుకుని హోటల్లోకి దూసుకొచ్చారు. శాంతియుతంగా మాట్లాడుకుందామనుకున్న వేళ, జనసేన కార్యకర్తలు దాడికి తెగబడటంతో భోజనం చేస్తున్న కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. కస్టమర్లను బెదిరించి బయటకు గెంటేయడంతోపాటు హోటల్లోని ఫ్రిజ్‌లు, కుర్చీలు, టేబుళ్లు, ఇతర విలువైన సామగ్రిని రోడ్డుపైకి విసిరేశారు. అంతటితో ఆగకుండా హోటల్‌కు తాళం వేసి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాష్టీకంపై బాధితుడు మజీద్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ అజయ్‌కుమార్, ఎస్సైలు దేవకుమార్, వెంకటరమణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అడ్డుకోబోయిన వైఎస్సార్ సీపీ మైనార్టీ నేతపై అరాచకం
కస్టమర్లను బెదిరించి, సామగ్రిని బయటకు విసిరేసిన వైనం


