కందకూరు: మండలంలోని ఓగూరు ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంపై కొందరు అధికార పార్టీ నేతలు రఘుబాబు, మనోహర్, మరికొందరు కక్షగట్టడం చర్చనీయాంశమైంది. ఎటువంటి అవినీతి లేకపోయినా, అంగన్‌వాడీ కార్యకర్తను, ఆయాలను తొలగించాలనే దురుద్దేశంతో పదేపదే ఫిర్యాదులు చేస్తూ ఐసీడీఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గత వారం రోజుల్లో అధికారులు పలుమార్లు తనిఖీలు చేపట్టారు. లబ్ధిదారులు మాత్రం సరుకులు సక్రమంగా అందుతున్నాయని, కార్యకర్త పనితీరు బాగుందని అధికారులకు నివేదించారు. అయినప్పటికీ, తమకు నచ్చినట్లుగా లేదని రాస్తేనే సంతకాలు చేస్తామంటూ అధికారులను ఫిర్యాదుదారులు బహిరంగంగానే బెదిరించడం గమనార్హం. ఇక ఫిర్యాదుదారుల్లో ఒకరైన రేషన్ డీలర్ రఘుబాబు మూడు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిపివేసి, అదే విషయాన్ని అంగన్‌వాడీ కార్యకర్తపై నెట్టేయాలని చూడటం వివాదాస్పదమవుతోంది. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి, ఫిర్యాదుదారుల పట్ల మెతకగా వ్యవహరిస్తూ సర్దుకుపోవాలని కోరడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగ్‌వాడీ సిబ్బంది కుటుంబాన్ని టీడీపీలో చేరాలని అధికారులు పరోక్షంగా చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మహిళా ఉద్యోగులను మానసిక వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మూడు నెలలగా అంగన్‌వాడీకి వచ్చే
కంది పప్పు ఇవ్వని డీలర్
పైగా లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం లేదని వరుసగా ఫిర్యాదులు
తనిఖీలో అంతా బాగానే ఉన్నట్లు తేల్చిన అధికారులు


