నాగులుప్పలపాడు: మాదిగ సమాజ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈదుమూడి గ్రామంలో వేలాది కార్యకర్తల నడుమ మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ దేశంలో సామాజిక ఉద్యమాల కోసం ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరులకు ఇప్పటి వరకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లోటును భర్తీ చేయడానికే ఉద్యమం పుట్టిన ఊరు ఈదుమూడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు. సమానత్వం కోసం మాదిగల రిజర్వేషన్ ఉద్యమమని స్పష్టం చేశారు. దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో, మాదిగ హక్కుల సాధనలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం కీలకపాత్ర పోషించిందన్నారు. ఉద్యమ చరిత్రను విస్మరించి విమర్శలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య, సంధ్య ఆక్వా చైర్మన్ కృష్ణ కుమారి, జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు ఆనంద్, నండూరి నరశింహరావు, మానికొండ శ్రీధర్, పానుగంటి షాలేమ్ రాజు, ఏటుకూరి విజయ్ కుమార్, రావినూతల కోటి తదితరులు పాల్గొన్నారు.


