కిడ్నీలో రాళ్లకు జీజీహెచ్‌లో లేజర్‌ చికిత్స | - | Sakshi
Sakshi News home page

కిడ్నీలో రాళ్లకు జీజీహెచ్‌లో లేజర్‌ చికిత్స

Jul 8 2026 2:32 AM | Updated on Jul 8 2026 2:32 AM

ఒంగోలు టౌన్‌: అత్యంత ఆధునిక లేజర్‌ విధానంలో కిడ్నీలో రాళ్లకు జీజీహెచ్‌లో ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాణిక్యరావు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల దిబ్బయ్య అనే వ్యక్తి కిడ్నీలో రాళ్ల సమస్యతో జీజీహెచ్‌ వైద్యులను సంప్రదించారని తెలిపారు. యూరాలజీ నిపుణుడు డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ బృందం వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స అవసరమని నిర్ధారించారన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల ఖర్చయ్యే లేజర్‌ విధానంలో ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు వివరించారు. కిడ్నీ రాళ్లకే కాకుండా మూత్రాశయ రాళ్లు, ప్రోస్టేట్‌ సమస్యలకు కూడా లేజర్‌ విధానంలో శస్త్ర చికిత్సలు చేయడానికి అవకాశం ఉందన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నామినేని కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఆధునాతన వైద్య పరికరాలు, అంకితభావం కలిగిన వైద్యులు ఉన్నారని తెలిపారు. అత్యంత ఖరీదైన చికిత్సలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు. దిబ్బయ్యకు విజయవంతంగా ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డా.మాలకొండారెడ్డి, డా.రసూల్‌, డా.జయసుందరంలను సూపరింటెండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఆర్‌ఎంఓ డా.మాధవీలత, ఏఆర్‌ఎంఓ డా.సునీల్‌ గవాస్కర్‌, డా.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement