మాటలు రాక, మానసిక సమస్యతో ఉన్న బాలుడు ఆడుకుంటూ బయటకు వెళ్లి ఆచూకీ లేని వైనం డ్రోన్ కెమెరాలు, డాగ్‌స్క్వాడ్‌లతో ముమ్మర గాలింపు
ఒంగోలు టౌన్: మరో చిన్నారి అదృశ్యమయ్యాడు. అప్పటి వరకు తల్లితో కలిసి ఉన్న ఆరేళ్ల బాలుడు రిచర్డ్ రేయాన్స్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. అంతే ఇక ఎంత వెదికినా కనపడక పోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. బాలుడి తల్లి ప్రత్యూష తెలిపిన వివరాల ప్రకారం...ఒంగోలుకు చెందిన చంద్రపాటి ప్రత్యూష మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని దుర్గా నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా చేస్తున్నారు. భర్త చంద్రశేఖర్‌తో కలిసి సోమవారం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొన్నారు. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు రిచర్డ్ రేయాన్స్‌కు ఆరేళ్లు. మాటలు రావు. మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ప్రత్యూష మంగళవారం రేయాన్స్‌ను తీసుకొని కాలేజీకి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఆమె విధుల్లో ఉండగా రేయాన్స్ కాలేజీ గేటు తీసుకొని బయటకు వచ్చాడు. కాలేజీ వాచ్‌మెన్ చూసి గట్టిగా కేకలేయడంతో భయపడి ఊర్లోకి పరుగులు తీశాడు. మార్గం మధ్యలో ఒక దుకాణం వద్ద ఆగి చాక్లెట్ కొనుక్కొని తిన్నాడు. కాసేపటి తరువాత ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బాలుడిని పలకరిస్తే భయంతో బిత్తర చూపులు చూస్తున్నాడని, గ్రామానికి కొత్త కావడంతో బాలుడ్ని గుర్తు పట్టలేకపోయామంటున్నారు. ఆ తరువాత బాలుడు అదృశ్యమయ్యాడు. గ్రామంలో ఎవరికీ కనిపించలేదు. బాలుడి కోసం గాలిస్తున్న తల్లిదండ్రులు ఎంత సేపటికీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలుడు అదృశ్యం కాగా రాత్రి చీకటి పడినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
డ్రోన్ కెమెరాలతో గాలింపు..
సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ హర్షవర్థన్ రాజు పోలీసులను అప్రమత్తం చేశారు. 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులతో మాట్లాడారు. గ్రామస్తులను విచారించారు. డ్రోన్ కెమెరాలు, పోలీసు డాగ్‌లతో ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులతో పాటు గ్రామస్తులు కూడా బాలుడి కోసం పరిసరాలు అనువణువూ గాలిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామంలోకి వచ్చారేమో ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసినట్లు ఎస్పీ తెలిపారు. పక్క జిల్లాల పోలీసు స్టేషన్లకు బాలుడి వివరాలను పంపించినట్లు చెప్పారు.
మాకు శత్రువులు ఎవరూ లేరు: చంద్రపాటి ప్రత్యూష, బాలుడి తల్లి
మేము ఈ ఊరికి నిన్ననే వచ్చాం. ఇక్కడ మాకు శత్రువులు ఎవరూ లేరని బాలుడి తల్లి ప్రత్యూష చెప్పారు. బాబుకు మాటలు రాకపోవడంతో తన వద్దనే ఉంచుకుంటానని, మధ్యాహ్నం వరకు తనతో కాలేజీలోనే ఉన్నాడని, 3 గంటల తరువాత బయటకు వెళ్లాడని కన్నీరు మున్నీరయ్యారు. ఊరు కొత్త కావడంతో పిల్లాడు ఎక్కడో తప్పిపోయాడని భావిస్తున్నామని, పోలీసులు, గ్రామస్తుల సహకారంతో బాబు దొరకాలని కోరుకుంటున్నానని తల్లి ప్రత్యూష కన్నీరు పెట్టుకున్నారు.
ఉలిక్కిపడ్డ చెరువుకొమ్ముపాలెం..
ఆరేళ్ల బాలుడు రిచర్డ్ రేయాన్స్ ఆదృశ్యం కావడంతో చెరువుకొమ్ముపాలెం గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. గత నెల 5వ తేదీ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో మునిగి మరణించడం తెలిసిందే. ఆ దుర్ఘటన గ్రామస్తులు ఇంకా మరిచిపోలేదు. తిరిగి ఇప్పుడు గ్రామంలో ఒక బాలుడు అదృశ్యమయ్యాడన్న వార్త గ్రామస్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులతో కలిసి బాలుడిని గాలిస్తున్నారు.


