కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

కాసుల వేట

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

చెరువు మట్టి.. కాసుల వేట

పట్టా భూములనూ వదల్లేదు..

హెచ్‌ఎంపాడులో మిట్టపాలెం చెరువుపై మట్టి మాఫియా కన్ను భారీ వాహనాలతో రేయింబవళ్లు తవ్వకాలు ప్రైవేటు పట్టా భూమినీ వదలని మాయగాళ్లు అధికార పార్టీ కీలకనేత అండతోనే గ్రావెల్‌ దందా అధికార పార్టీ మనుషులమంటూ బెదిరింపులు మాకేమీ తెలియదంటున్న అధికారులు కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న బాధితులు

కనిగిరిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సహజ వనరులను కొల్లగొట్టి జేబులు నింపుకుంటున్నారు. అధికారం మాది.. అడ్డగోలుగా తవ్వేస్తాం.. అడ్డొచ్చారో.. అధికారులతో అక్రమ కేసులు బనాయించి లోపల తోస్తాం అంటూ నియోజకవర్గ ముఖ్యనేత అండతో బెదిరింపులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు.
చెరువు మట్టి..

సాక్షి టాస్క్‌ఫోర్స్‌:

నిగిరి నియోజకవర్గం హెచ్‌ఎంపాడు మండలం మిట్టపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో పది రోజులుగా అధికార పార్టీ నేతలు భారీ వాహనాలతో తవ్వకాలు జరుపుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా చెరువు మట్టిని తరలించేస్తున్నారు. భారీ పొకై ్లనర్‌, జేసీబీలతో సుమారు 5 నుంచి 10 మీటర్లకు పైగా లోతుగా తవ్వి మట్టిని తోడేస్తున్నారు.

రియల్‌ వెంచర్లకు తరలింపు..

అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అండతో జరుగుతున్న మిట్టపాలెం చెరువు మట్టి అక్రమ తవ్వకం నేరుగా.. టీడీపీ నేతల అధికార వెంచర్లకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కనిగిరి– కంభం రోడ్డులోని శ్రీరంగాపురం సమీపంలో ఓ పెద్దనేత వెంచర్‌కు తరలిస్తున్నట్లు గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మరికొంత మట్టిని అక్రమార్కులు ఇతర వెంచర్లకు పట్టణంలోకి తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే సింహ భాగం హెచ్‌ఎంపాడు రోడ్డులోని వెంచర్లకే వెళుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మౌనం దాల్చుతున్న అధికారులు..

సహజంగా ఓ ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్‌ మట్టి తవ్వుకుంటే.. ఆఘమేఘాలపై వాలిపోయి రచ్చరచ్చ చేసే.. సచివాలయ, పంచాయతీ, మైనింగ్‌, పీఆర్‌, ఇరిగేషన్‌ అధికారులు.. పది రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుంటే తమకేమీ తెలియదన్నట్లు మౌనం దాల్చుతుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువులో మట్టిని మాయం చేస్తున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే..

దీనిపై పీఆర్‌ ఏఈని ‘సాక్షి’ అడగ్గా.. మిట్టపాలెం కుంట తమ పరిధిలోకి రాదని.. తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శిని అడగ్గా తాను కొత్తగా ఇటీవలే జాయిన్‌ అయ్యానని.. గ్రామ చెరువు కుంటలో తవ్వకాల సంగతి తనకు తెలియని చెప్తుండడం గమనార్హం.

ఎమ్మెల్యే బంధువులు బెదిరిస్తున్నారు: మేకల రాజు

మిట్టపాలెం చెరువులో రెండు వారాలుగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఆ తర్వాత రెండ్రోజుల నుంచి మా పట్టా భూమిలో జేసీబీలు, పొక్‌లైన్‌లతో భారీగా టిప్పర్‌లు తెచ్చి.. మా పట్టా భూమిలో కూడా తవ్వకాలు ప్రారంభించారు. మా పూర్వీకుల నాటి పొలం పూర్తి హక్కులున్నాయని, మా భూమిలో మట్టిని తవ్వడం సరికాదని అడ్డుకున్నాం. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే బంధువులం మాకే అడ్డు చెబుతావా అని బెదిరిస్తున్నారు. మా పట్టా భూమిలో కూడా భారీగా తవ్వకాలు చేసి, మట్టిని రియల్‌ వెంచర్లకు తరలిస్తున్నారు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో, రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. కనీసం పట్టించుకోవడం లేదు. పైగా మా పైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అసలు మీకు హక్కులు లేవు. ఎక్కువ మాట్లాడితే కేసు కడతామని అధికారులు, అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం.

మట్టి మాఫియాగాళ్లు చెరువులనే కాదు దాని పక్కనున్న పట్టా భూముల్లో సైతం దౌర్జన్యంగా తవ్వకాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమంతునిపాడు మండలం మిట్టపాలెం గ్రామ పంచాయతీకి చెందిన మేకల చిన్నవీర, మేకల రాఘవయ్య తెలిపిన వివరాల ప్రకారం..1983 ఏప్రిల్‌ 5న చీరాల తాలూకా గ్రామం నల్లగాంధీ బొమ్మ వెనుక నివాసం ఉంటున్న శనగవరపు వెంకటేశ్వర్లు కుమారుడు పరదేశి శాసీ్త్ర విక్రయ స్వాధీన అగ్రిమెంట్‌ సర్వే నంబర్‌ 436లో 6.39 ఎకరాలున్న సెటిల్‌మెంట్‌ భూమి విక్రయ అగ్రిమెంట్‌ పొందారు. ఆయన తండ్రి మృతి చెందడంతో ఆ భూమిని తన పేరుపై ఉన్న పాస్‌బుక్‌లో ఎంటర్‌ చేయించుకున్నట్లు చెప్పారు. అయితే ఆ భూమి ఆన్‌లైన్‌కు ఎక్కలేదు. ఈ విషయాన్ని గ్రహించిన అక్రమార్కులు చెరువు పక్కనే ఉన్న సర్వే నంబర్‌ 436లో కలిగిన భూమిలో మట్టి తవ్వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదేమిటని తాను ప్రశ్నించగా భూమి నీది కాదని, ప్రభుత్వ భూమని మీ గ్రామస్తులు చెప్పారని దబాయిస్తూ దౌర్జన్యంగా మట్టిని తోడేస్తున్నారని వాపోతున్నాడు. పొలం అంతా భారీగా లోతు గుంటలు చేశారని మేకల రాఘవయ్య వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement