నాడు మామకు నేడు ప్రజలకు వెన్నుపోటు
జిల్లాలో పార్టీ బలోపేతం చేస్తున్నాడని బూచేపల్లి క్వారీలు మూసే కుట్ర
వెన్నుపోటుకు రెండేళ్లు రౌండ్ టేబుల్ సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
మాట్లాడుతున్న బూచేపల్లి వెంకాయమ్మ, పక్కన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
దర్శి:
చంద్రబాబు చరిత్రే వెన్నుపోటుమయం అని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్, మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. స్థానిక తాలూకా క్లబ్ సమావేశం హాలులో దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు రౌండ్‌్ టేబుల్ సమావేశానికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు బూచేపల్లి, వైఎస్సార్ సీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నమ్మి ఓట్లేసిన వారికి వెన్నుపోటు పొడవటమే చంద్రబాబు ప్రత్యేకత అన్నారు. తన అన్నకు, మామకు వెన్నుపోటు పొడిచారని, ఆయన జీవితం అంతా వెన్నుపోట్లమయమే అని చెప్పారు. గత ఎన్నికల ముందు కూటమి కట్టి అబద్ధపు హామీలు ఇచ్చి రెండేళ్లయినా ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. పాలన చేయడం చేతకాక ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేసి ఇక్కడ పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. ఆయన ధాటికి తట్టుకోలేక ఆయన క్వారీలపై దాడులు చేయించి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఇలాంటి వాటికి భయపడరని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. రానున్న జగనన్న పాలనలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్ల పాలన ఎలా ఉందో...గత జగనన్న పాలనలో కరోనా కష్టకాలం వచ్చినా జగనన్న పాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. రైతులకు ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయినా రూపాయి విదిలించింది లేదన్నారు. చంద్రబాబు దోచుకోవడం కోసం పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తూ పేదలకు వైద్యం అందకుండా వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని స్పష్టం చేశారు. ఒక సారి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తేనే అబద్ధపు హామీలు ఇవ్వకుండా ఉంటారన్నారు. చంద్రబాబు అన్నీ కులాలకు, అన్నీ మతాలకు, పేదలు, రైతులకు అన్నీ చేస్తామని ఏమీ చేయకుండా అందరినీ మోసంి చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు మోసపూరిత మాటలు చెప్తారని, అటువంటి మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ అంటూ సుమారు 140 హామీలిచ్చి నమ్మబలికి ఓట్లు వేయించుకున్న చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లు చంద్రబాబు చేసింది ఇసుక మాఫియా, మద్యం మాఫియా అని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్యాకేజీలకు లొంగిపోయి ప్రశ్నించడం మానుకున్నారన్నారు. గ్రామాల్లో ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు, అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్న తీరు ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. తాను జగనన్న పక్కన ఉన్నానన్న ఉద్దేశంతో తన క్వారీలు మూసివేసే కుట్రలు చేస్తున్నారని ఎటువంటి కుట్రలు చేసినా జగనన్న తోనే తన పయనం ఉంటుందన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరింపులకు లొంగిపోయే వ్యక్తి తాను కాదన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రాజకీయాల్లో మాట తప్పని మడమ తిప్పని ఒకే ఒక్క నాయకుడు జగనన్న అని చెప్పారు. నాడు–నేడు, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఇచ్చిన 100 శాతం హామీలు నెరవేర్చిన సీఎంగా దేశ చరిత్రలో నిలిచిపోయారన్నారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ప్రతి నెల రూ.1500, రాష్ట్రంలో 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగం లేని నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ రూ.20 వేలు ఇస్తామని రైతులను మోసం చేశారన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన పేద పిల్లలకు ఇచ్చిన బ్యాగులు చూస్తేనే అర్థమవుతుందన్నారు. మూడు రోజులకే చినిగిపోయిన బ్యాగులు, నాణ్యత లేని భోజనాలు తినలేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతే రూపాయి విదిలించింది లేదన్నారు. ఇటువంటి దుర్మార్గపు పాలనను పారదోలేందుకు రైతులు, ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ మండల కన్వీనర్‌లు వెన్నపూస వెంకటరెడ్డి, తూము వెంకటసుబ్బారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, ఎంపీపీలు బొరిగొర్ల ఉషామురళి, జెడ్పీటీసీలు నుసుం వెంకటనాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ్‌భాస్కర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
2029లో సీఎం జగనన్నే


