బాలల అక్రమ రవాణా గుట్టు రట్టు | - | Sakshi
Sakshi News home page

బాలల అక్రమ రవాణా గుట్టు రట్టు

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో అలజడి బీహార్‌లోని జోగ్‌పూర్‌ నుంచి చైన్నె వెళ్లే రైలు నుంచి 23 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిలో బీహార్‌ నుంచి చైన్నెకి అక్రమంగా తరలిస్తున్న 15 మంది బాలురు జాయింట్‌ కలెక్టర్‌ ముందు హాజరు పరిచిన పోలీసులు

ఒంగోలు సబర్బన్‌: పోలీసులు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ కమిటీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల జాయింట్‌ ఆపరేషన్‌లో బాలల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. బీహార్‌ నుంచి చైన్నెకి 15 మంది బాలలను అక్రమంగా తరలిస్తున్నారని బీహార్‌ నుంచి ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకాశం జిల్లాలోని హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఒంగోలు మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంక్షేమ కమిటీ, ఒంగోలు జీఆర్‌పీ పోలీసులు, ఆర్పీఎఫ్‌ పోలీసులు, షార్ట్స్‌ హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ వలంటీర్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. దీంతో ఒంగోలు రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా అలజడి నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని మూడో ప్లాట్‌ ఫాంలోకి సాయంత్రం 6.15 గంటలకు బీహార్‌ రాష్ట్రం జోగ్‌పూర్‌ నుంచి చైన్నె ఈ రోడ్‌కు వెళ్లే ట్రైన్‌(16602) వచ్చి ఆగింది. అంతే భారీ స్థాయిలో ఉన్న జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు, వివిధ శాఖల అధికారులు ట్రైన్‌కు ముందు, వెనుక ఉన్న జనరల్‌ భోగీలను చుట్టుముట్టి భోగీలలోకి ప్రవేశించారు. బీహార్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు వాళ్లను గుర్తించి అన్ని భోగీల నుంచి దాదాపు 23 మందిని తమ ఆధీనంలోకి తీసుకొని రైల్వే స్టేషన్‌లోనే ఉన్న జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారిలో 15 మంది మైనర్‌ బాలురు ఉన్నారు.

అనంతరం కలెక్టర్‌ పి.రాజాబాబుకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి ముందు బాలలను ప్రవేశ పెట్టారు. జాయింట్‌ కలెక్టర్‌ బాలలను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు బీహార్‌ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల నుంచి వచ్చారు, వారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలలను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బాలలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మా నాయక్‌ ఆధ్వర్యంలో వారిని తొలుత అంబేడ్కర్‌ భవన్‌కు తరలించారు. అక్కడ నుంచి వేరే సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. బాల కార్మికులను రక్షించటంలో కమిటీ చైర్మన్‌ నీలిమ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పీ.దినేష్‌ కుమార్‌, ఒంగోలు ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వై కొండయ్య, జీఆర్పీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీరామ్‌, స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ ఆర్‌ సునీల్‌ కుమార్‌, హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బీవీ సాగర్‌, అసోసియేషన్‌ ఫర్‌ వాలంటరీ యాక్షన్‌ శ్రీకాంత్‌, ఏపీడీఆర్‌. డాక్టర్‌ ప్రహసిత్‌, సాడ్స్‌ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, సుమన్‌తో పాటు పలువురు భాగం పంచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement