పెట్రో ధరలకు నిరసనగా రోడ్డెక్కిన కమ్యూనిస్టు పార్టీలు వామపక్షాల రాస్తారోకోపై పోలీసుల జులుం
ఒంగోలు టౌన్: పెంచిన పెట్రోలు, డీజిల్‌ఽ, వంటగ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కేంద్రమైన ఒంగోలు ఆర్టీసీ బస్టాండు సెంటర్లో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతంగా మారింది. సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రాస్తారోకోలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ప్రజా సంఘాల నాయకులను తాలూకా సీఐ చొక్కా పట్టుకొని లాక్కెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే నెలలో 4 సార్లు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచడంపై వామపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ చౌరస్తాలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తాలూకా సీఐ విజయ కృష్ణ, ఇద్దరు ఎస్సైలు, రక్షక్ టీం బందోబస్తు నిర్వహించారు. రాస్తారోకో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు జీవీ కొండారెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం, సీపీఐ ఎంఎల్ నాయకులు నాంచార్లు, ఆర్.మోహన్‌లను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. తాలూకా సీఐ విజయకృష్ణ సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావును చొక్కా కాలర్ పట్టుకొని లాక్కెళ్లడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా నిరసనకారులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను తాలూకా పోలీసు స్టేషన్‌కు తరలించి గంట తరువాత వారిని విడిచిపెట్టారు.
కేంద్ర ప్రభుత్వ అసమర్ధత వల్లనే పెట్రో సమస్య...
గల్ఫ్ యుద్ధం సమయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే దేశంలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడానికి కారణమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు విమర్శించారు. మన నౌకలను అడ్డుకోకుండా ఇరాన్ స్నేహధర్మాన్ని పాటిస్తే హార్మోజ్ జలసంధి వెలుపల మోహరించిన అమెరికా సైన్యాలు మన పడవలను అడ్డుకోవడంతోనే అసలు సమస్య తలెత్తిందని వివరించారు. అయినా మన దేశం అమెరికా, ఇజ్రాయిల్‌లకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం దారుణమని చెప్పారు. మన రాష్ట్రంలో గోదావరి బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న చమురును గుజరాత్, మహారాష్ట్రలకు తరలించి రిలయన్స్ కంపెనీ లాభపడుతోందని ఆరోపించారు. కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో చట్టపరంగా 50 శాతం వాటా మన రాష్ట్రానికి రావాల్సి ఉందని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన కూటమి పాలకులు మౌనంగా ఉండడం వలన రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. మోదీ భజన చేస్తున్న కూటమి పాలకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి.రమేష్, కె.రమాదేవి, బంకా సుబ్బారావు, కేజీ మస్తాన్, శ్రీరాం శ్రీనివాసులు, ఎంఏ సాలార్, రామకృష్ణ, ఆర్.మోహన్, బి.పద్మ, ఎస్.లలిత కుమారి, సాయి, పరిటాల కోటేశ్వరరావు పాల్గొన్నారు.


