అధికార పార్టీ అండతో బరి‘తెగింపు’ | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అండతో బరి‘తెగింపు’

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

కనిగిరి రూరల్‌: అక్రమార్జన కోసం టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓవైపు ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు జలధార, జలహారతి పేరుతో ఒక్క నీటిబొట్టు కూడా వృథా కాకుండా ప్రతి చెరువులోని నీటి చుక్కను రక్షించుకోవాలని, చెరువుల్లో వర్షం నీరు నిలిపేందుకు అధికార యంత్రాంగం, అధికారులు పూర్తిగా పనిచేయాలని ఉపోద్ఘాతాలు చేస్తూ ప్రచారాల డప్పు కొడుతుంటే.. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ నేతలు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ వేలాది ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువుకు గండి కొట్టారు. కేవలం చేపల కాంట్రాక్టర్‌ కోసం తొర్రలు పెట్టి నీరు వృథా చేశారు. ఈ సంఘటన మంగళవారం కనిగిరిలో జరిగింది. మండలంలోని నేలటూరి గొల్లపల్లి చెరువు మోంథా తుఫాన్‌ వర్షాలకు చాలా కాలం తర్వాత నిండింది. ఎన్‌.గొల్లపల్లి రిజర్వాయర్‌ కింద సుమారు 3 వేలకుపైగా అధికారిక ఆయకట్టు ఉండగా, కనిగిరి, వెలిగండ్ల మండలాల కింద దాదాపు 15 గ్రామాలకు చెందిన రైతుల భూములకు కూడా ఉపయోగం కలుగుతోంది. అంతేగాకుండా మండలంలోని సుమారు 20 గ్రామాల్లో ఆ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలతో భూగర్భ జలమట్టం పెరిగి కొంతకాలంగా గ్రామాల్లో నీటి సమస్య కూడా అంతగా లేదు. లక్షల సంఖ్యలో ఉన్న పశువులు, మేకలు, గొర్రెలకు దాహార్తి తీరుస్తోంది. అలాంటి గొల్లపల్లి రిజర్వాయర్‌కు గండికొట్టడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చేపల కాంట్రాక్టర్‌ కోసం అధికారమే

అండగా గండి...

అధికార పార్టీ చోటా నేతల అండతో చేపల గుత్తేదారుల కోసం ఎన్‌.గొల్లపల్లి చెరువు తూము గండికొట్టడంతో లక్షల లీటర్ల నీరు వృథాగా పోతోంది. అయినప్పటికీ సచివాలయం, ఇరిగేషన్‌, పంచాయతీ అధికారులు కనీసం ఆవైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. చేపల కాంట్రాక్టర్‌తో పార్టీ చోటా నేతలు కుమ్మకై ్క ప్రజలు, రైతులకు ఉపయోగపడే నీటిని వృథా చేయడంపై అందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌, ఆర్డీఓ, డీఈలకు దద్దాల

నారాయణ యాదవ్‌ ఫిర్యాదు...

ఎన్‌.గొల్లపల్లి రిజర్వాయర్‌లో సంవృద్ధిగా ఉన్న నీటిని కేవలం చెరువులోని చేపలు పట్టుకునేందుకు, చేపల కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకు అధికార పార్టీ నాయకులు గండి కొట్టి వృథా చేయడం దారుణమని వైఎస్సార్‌ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ అన్నారు. కలెక్టర్‌, ఆర్డీఓ, ఇరిగేషన్‌ డీఈఈకి ఆయన ఫిర్యాదు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు గండి కొట్టడం వలన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సుమారు 30 గ్రామాల్లో భూగర్భ జాలాల నీటి మట్టం పడిపోయి భవిష్యత్తులో నీటి సమస్య ఏర్పడుతోందని, అనేక మూగజీవాల దాహార్తికి నీరు లేక అల్లాడుతాయని వివరించారు. కేవలం అధికార పార్టీ నాయకులు వారి ఆదాయం కోసం రైతుల కడుపు కొట్టేందుకు దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తక్షణం అధికారులు స్పందించి చెరువుకు గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, నీరు వృథా కాకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టాలని దద్దాల కోరారు.

ఎన్‌.గొల్లపల్లి చెరువుకు గండికొట్టిన దుండగులు

చేపల కోసం తూముకు తొర్ర

చెరువులోని నీరంతా వృథా

గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఆర్డీఓ, డీఈఈలకు దద్దాల నారాయణ ఫిర్యాదు

ఫిర్యాదు చేస్తున్నాం :

గుర్తు తెలియని వ్యక్తులు ఎన్‌.గొల్లపల్లి రిజర్వాయర్‌ తూముకు గండి కొట్టారు. దీంతో నీరు వృథాగా పోతోంది. ఈ విషయాన్ని తెలుసుకుని నీరు నిలిచే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం నీటి వృథా ఆగింది. తూముకు శాశ్వత మరమ్మతులకు నివేదికలు పంపాం. చెరువుకు గండి కొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నాం.

మధుబాబు, ఇరిగేషన్‌ ఏఈ, కనిగిరి

Advertisement
 
Advertisement
Advertisement