కందుకూరు:
కందుకూరు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వారితో పాటు వినియోగిస్తున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు... కందుకూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకం, వినియోగంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. పట్టణంలోని ఆనందపురం రోడ్డులో డంపింగ్‌యార్డు వద్ద 14 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 473 గ్రాముల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, గుడ్లూరు రోడ్డులోని టవర్ వద్ద ఇద్దరిని అరెస్టు చేసి 2.400 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పట్టణంలోని బూడిదపాలేనికి చెందిన అప్రోజ్, శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన ఆరితోటి వెంకట్, పోతురాజుమిట్టకు చెందిన కుంచాల చందు, ఖాజీపాలేనికి చెందిన ఎస్‌కే సుభాని, ఉప్పుచెరువు కాలనీకి చెందిన షేక్ కరీం, అబుతలహా, బండపాలేనికి చెందిన మడతసాయి, చిన్న కత్తుల జిలాని, బలిజపాలేనికి చెందిన మంగమూరి శివకృష్ణ, తుమ్మా చెంచుమాధవ, ఓగూరు గ్రామానికి చెందిన నాగులూరి ఆమోస్, కోట మహేష్, జంగిలి విగ్నేష్, ఏకలవ్యనగర్‌కు చెందిన పల్లా లాజర్, విప్పగుంట రోడ్డులోని గురునాథం బలరాంతో పాటు మైనర్ అయిన మరో యువకుడు ఉన్నారు. వీరి వద్ద నుంచి మొత్తం 2.873 కేజల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అప్రోజ్, గురునాథం బలరాం అనే ఇద్దరు గంజాయి తెచ్చి అమ్ముతుంటారని, మిగిలిన వారంతో వినియోగించే వారేనని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరు వైజాగ్, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి తెప్పిస్తారని, ఈ ప్రాంతానికి గంజాయి సరఫరా చేసే ముఠా ఒకటి ప్రత్యేకంగా ఉందని డీఎస్పీ తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ ముఠానే గంజాయి సరఫరా చేస్తోందని, మిగిలిన వారి కోసం కూడా పోలీసుల అన్వేషణ సాగుతోందని తెలిపారు. గంజాయి విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అన్ని పోలీస్ స్టేషన్లకు ఎన్‌డీబీ కిట్లు...
ప్రభుత్వం నుంచి ఎన్‌డీబీ కిట్లు కూడా వచ్చాయని, అన్ని పోలీస్ స్టేషన్లకు వాటిని సరఫరా చేశామని డీఎస్పీ తెలిపారు. వాటి ద్వారా గంజాయి తాగారా లేదా అనేది వెంటనే నిర్ధారణ చేయవచ్చని చెప్పారు. గంజాయి వినియోగించే వారి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చెప్పాలని కోరారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన పోలీస్ అధికారులను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ అన్వర్‌బాషా, కందుకూరు టౌన్, రూరల్, ఉలవపాడు ఎస్సైలు పులి శివనాగరాజు, బాలకృష్ణ, సుబ్బారావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
తమ పిల్లలను అన్యాయంగా
ఇరికించారంటూ తల్లిదండ్రుల ఆవేదన...
గంజాయి కేసులో తమ పిల్లలను అన్యాయంగా ఇరికించారంటూ నిందితుల తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తమ ఇళ్లకు వచ్చిన పోలీసులు బలవంతంగా తమ పిల్లలను తీసుకెళ్లారని, గంజాయి ప్యాకెట్లు చేతుల్లో పెట్టి ఫొటోలు తీశారని ఆరోపించారు. తాము అడిగితే వెంటనే పంపిస్తామని చెప్పారని, కానీ, ఇలా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.
పట్టుబడిన వారిలో గంజాయి విక్రయదారులు, వినియోగదారులు
వారి వద్ద నుంచి 2.873 కేజీల గంజాయి స్వాధీనం
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన పోలీసులు
అక్రమంగా అరెస్టు చేశారంటూ బాధితుల బంధువుల ఆవేదన


