లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్టులో చేపల పెంపకం కోసం ఎటువంటి వ్యర్థాలు ఉపయోగించలేదని ప్రాజెక్టు ఈఈ మునిరత్నం తెలిపారు. ఇటీవల కందుకూరు నియోజకవర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు, సోషల్ మీడియా గ్రూపులు ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టులో చేపల పెంపకం కోసం వ్యర్థ పదార్థాలు ఉపయోగిస్తూ నీటిని కలుషితం చేస్తున్నారంటూ ప్రచారం చేశారని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నాని ఈఈ తెలిపారు. జలవనరులశాఖ ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణలో రాళ్లపాడు ప్రాజెక్టు ఉంటుందని, ప్రాజెక్టులో చేపల పెంపకందారులు ఎటువంటి వ్యర్థ పదార్థాలు, ఎరువులు, ఇతర కాలుష్యకారక పదార్థాలు ఉపయోగించలేదని చెప్పారు. అలాగే, గ్రామీణ నీటి సరఫరాశాఖ కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వద్ద సేకరించే నీటి నమూనాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నీటి నాణ్యతకు సంబంధించి ఎటువంటి అభ్యంతరకర పరిస్థితులు గుర్తించలేదన్నారు. వినియోగానికి అనుకూలంగానే తాగునీరు ఉందని సంబంధిత అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9 అడుగుల మేరకు నీరు నిల్వ ఉందని, నీటిమట్టం తగ్గేకొద్దీ నీటిలో సహజసిద్ధంగా మసకదనం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. దీనికి చేపల పెంపకం కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదని ప్రజలు గమనించాలన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రాజెక్టులో వ్యర్థ పదార్థాలు కలుపుతున్నారని నిరాధార, అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఫిర్యాదు చేస్తామని ఈఈ హెచ్చరించారు.
ఒంగోలు సిటీ: స్థానిక ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకాలకు జారీ చేసిన ప్రకటనకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీ వరకు నిర్ణయించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వ సాధారణ నియామక పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. అదేవిధంగా దరఖాస్తుల హార్డ్ కాపీలు, ధ్రువీకరణ పత్రాలు, స్వీయ ఽధ్రువీకరణ పత్రాలు విశ్వవిద్యాలయానికి చేర్చాల్సిన గడువును ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర నిబంధనలు, షరతులు యథాతథంగా అమలులో ఉంటాయని తెలిపారు.
సింగరాయకొండ: జాతీయ రహదారిపై జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో సింగరాయకొండ మండల పరిధిలోని పెరల్ డిస్టిలరీ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ పోకిరి దానయ్యకు కుడి కాలు విరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెరల్ డిస్టిలరీ సమీపంలో లారీ యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో ఉండగా వెనకాల అతివేగంగా వచ్చిన గుంటూరు డిపోకు చెందిన గుంటూరు–తిరుపతి సూపర్‌లగ్జరీ బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. లారీ వెనుక భాగం, బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేగాన్ని నియత్రించుకోలేక ఆర్టీసీ బస్సు రోడ్డుకు ఎడమవైపున్న గుంతలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు డ్రైవర్ స్వగ్రామం గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామం కాగా, 108లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. ప్రయాణికులను ఇతర ఆర్టీసీ బస్సుల్లో హైవే పెట్రోలింగ్ పోలీసులు పంపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సుధీర్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
సంతమాగులూరు (అద్దంకి రూరల్): పాతకక్షల నేపథ్యంలో మహిళపై రాడ్డుతో వ్యక్తి దాడిచేసిన ఘటన మంగళవారం సంతమాగులూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కామేపల్లి గ్రామానికి చెందిన లక్కిపోగు దిబ్బమ్మ, బుల్లి అంకయ్య, దీనమ్మల మధ్య పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంకయ్య ఆగ్రహంతో రాడ్డుతో దిబ్బమ్మపై దాడికి పాల్పడ్డాడు. క్షతగాత్రురాలిని వైద్యం కోసం సంతమాగులూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.


