కంభం: అడవిపందిని ఢీకొట్టి ద్విచక్రవాహనదారుడు మృతిచెందిన సంఘటన కంభం మండలంలోని నల్లకాల్వ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గిద్దలూరు మండలంలో క్రిష్ణమూర్తిపల్లికి చెందిన భూపని తిరుమలయ్య (44) సోమవారం రాత్రి కంభం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. నల్లకాల్వ సమీపంలో అకస్మాత్తుగా అడ్డొచ్చిన అడవిపందిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అడవిపంది చనిపోగా, కిందపడిన తిరుమలయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు.
అద్దంకి రూరల్: అద్దంకిలోని ఇటుక బట్టీలో వెట్టిచాకిరీ చేస్తున్న 10 మంది కార్మికులకు మంగళవారం విముక్తి లభించింది. కలెక్టర్ రాజాబాబు ఆదేశాలతో మండల రెవెన్యూశాఖ, విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖ, లేబర్ ఆఫీసర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒంగోలు వారు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా అద్దంకిలోని కలవకూరు రోడ్డులో రెండు ఇటుక బట్టీలను తనిఖీలు చేశారు. ఒడిశాకు చెందిన 10 మంది కార్మికులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి వారి స్వగ్రామాలకు పంపినట్లు లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు తెలిపారు.


