ముండ్లమూరు: ప్రమాదవశాత్తూ కాలుజారి చిలకలేరు వాగు బావిలో పడి గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని చిలకలేరు వాగులో మంగళవారం చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పసుపుగల్లు పంచాయతీ పరిధిలోని చింతలపూడి గ్రామానికి చెందిన కాటూరి శ్రీనివాసరావు (50) గొర్రెల కాపరిగా ఉన్నాడు. ప్రమాదశాత్తూ కాలుజారి గ్రామానికి సమీపంలో చిలకలేరు వాగులో ఉన్న బావిలో పడిపోయాడు. తనకున్న గొర్రెలను మేత కోసం గ్రామానికి సమీపంలో ఉన్న చిలకలేరు వాగు వద్దకు తోలుకెళ్లిన సమయంలో ఒక పొట్టేలు పిల్ల దాహం తీర్చుకునేందుకు వాగులోకి దిగింది. దాంతోపాటు మిగతా జీవాలు కూడా వెళ్లడంతో వాటిని అదుపు చేసేందుకు శ్రీనివాసరావు వెళ్లాడు. వాగులో నేలబావి ఉన్న విషయాన్ని గుర్తించకపోవడంతో అందులో జారి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలోని పశువుల కాపర్లు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపారు. వాళ్లు వచ్చి చూసేసరికే చనిపోయి ఉన్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీనివాసరావుకు భార్య అంజమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ముండ్లమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


